Sivasena: శభాష్‌ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు

Shiv Sena Praises Madhya Pradesh Govt Decision To Support Orphan Kids - Sakshi

‘సామ్నా’ పత్రికలో సంపాదకీయం చర్చనీయాంశం

మధ్యప్రదేశ్‌ విధానాలు కొనియాడిన శివసేన

ముంబై: ప్రస్తుత కరోనా సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్ర సేవలను ప్రశంసించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు అభినందనలు తెలిపింది. ఒక బీజేపీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇంతకీ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు పింఛన్‌ రూపేణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై తాజాగా శివసేన స్పందించింది. ఆ పార్టీ గొంతుకగా భావించే ‘సామ్నా’ పత్రికలో మధ్యప్రదేశ్‌ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ సంపాదకీయం ప్రచురించింది. ఈ పిల్లల బాధ్యత చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలపడం అభినందనీయమని శివసేన కొనియాడింది. ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్‌ సరుకులు అందిస్తామనడంపై అభినందించింది. (‘సామ్నా’ సంపాదకీయం చదవండి)

‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్‌ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో శివసేన పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్‌ప్రభుత్వం ఒక మార్గం చూపిందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది.

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా’ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌ అవనసరంగా శివసేన ‘సామ్నా’లో స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top