
ఢిల్లీ: పాక్‌ను ఎలా నమ్మగలం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ దేశ తీరుపై మండిపడ్డారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. దీనిపై శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అంటూ దుయ్యబట్టారు.
భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని.. కానీ.. ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా వారికి తెలిసేలా చేసిందన్నారు. పాక్ గుణపాఠం నేర్చుకోవాలని.. ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలంటూ శిశిథరూర్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించి పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కన్పించాయి.
మరో వైపు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కనిపించాయి. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.