రెండో డోసుకు 11 కోట్ల మంది దూరం

Second dose of Covid vaccine overdue for over 11 crore people - Sakshi

అర్హుల్లో 32% మందికి కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తి

న్యూఢిల్లీ:  దేశంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత నిర్దేశిత గడువులోగా రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలో మొదటి డోసు తీసుకున్న వారిలో 11 కోట్ల మంది గడువు తీరిపోయినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 11 కోట్ల మంది రెండో డోసుకు దూరంగా ఉన్న అంశం బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రతినిధులతో నిర్వహించిన భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలాంటి వారిని గుర్తించి, టీకాపై అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది.

కోవిషీల్డ్‌ టీకా తీసుకుంటే రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధి ఉండాలి. కోవాగ్జిన్‌ తీసుకుంటే నాలుగు వారాల వ్యవధి ఉండాలి. నిర్దేశిత గడువు తీరిపోయినా రెండో డోసు వేయించుకోనివారిలో 49 శాతం మంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, బిహార్‌లో ఉన్నారు. భారత్‌లో కరోనా టీకాకు అర్హులైనవారిలో ఇప్పటిదాకా 76 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైన వారందరికీ మొదట డోసు ఇచ్చారు. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 50 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. దేశంలో కరోనా టీకాకు అర్హులు 94 కోట్ల మంది ఉండగా, వీరిలో 32 శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top