నిషేధం ఉన్నా పనులు సాగుతున్నాయా ? | Sakshi
Sakshi News home page

నిషేధం ఉన్నా పనులు సాగుతున్నాయా ?

Published Tue, Nov 30 2021 6:22 AM

SC warns against worsening Delhi air pollution - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కట్టడాల నిర్మాణం, కూల్చివేతలపై నిషేధం అమల్లో ఉన్నా సరే మోదీ సర్కార్‌ సెంట్రల్‌ విస్టా పనులను నిరాటంకంగా కొనసాగిస్తోందని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో న్యాయవాది వికాస్‌ సింగ్‌ ఆరోపించారు. దీంతో సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

‘ నిషేధం ఉన్నా సరే ప్రభుత్వం సెంట్రల్‌ విస్టా పనులను కొనసాగిస్తోందా? అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోర్టు సూటిగా ప్రశ్నించింది. ‘ ఈరోజు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ దారుణంగా 419కు పెరిగిపోయింది. ఇక్కడ కాలుష్యం రోజురోజుకూ ఎక్కువవుతోంది. కాలుష్య నియంత్రణపై రాష్ట్రాలకు ఆదేశాలిచ్చామంటారు. కాగితాలపై అంతా బాగానే ఉంటుంది. వాస్తవానికొచ్చేసరికి మార్పు శూన్యం’ అని సీజే జస్టిస్‌ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉన్నా రోజూ కాలుష్యం పెరుగుతుండటంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించారు.

Advertisement
Advertisement