ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎంత అవగాహన కల్పించిన దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక మోసం నమోదవుతనూ ఉంది. తాజాగా ముంబై పోలీసులమని చెప్పి ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేశారు. జీవితంతం కష్టపడి సంపాదింఇ, పొదుపు చేసుకున్న సొమ్ము "డిజిటల్ అరెస్ట్" స్కాంలో పోవడంతో ఆయన గుండే ఆగిపోయింది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ స్కామ్ స్టోరీ ఎలా మొదలైంది అంటే..
పూణేకు చెందిన 82 ఏళ్ల రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి, ఆయన 80 ఏళ్ల భార్యని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఆగస్టు 16న ముంబై పోలీసులం, "ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్" అంటూ వచ్చిన ఒక ఫోన్ కాల్ వారి జీవితాన్ని అతలా కుతలం చేసింది. ఆగస్టు 16-సెప్టెంబర్ 17 మధ్య సాగిన ఆ స్కాంలో విదేశాల్లో స్థిరపడిన ముగ్గురు కుమార్తెలు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ భార్యభర్తల్లిద్దరినీ మోసగాళ్లు బెదిరించారు. ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన బ్యాంక్ ఖాతా , ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉన్నాయంటూ మూడు రోజుల పాటు వారిని కదలకుండా, మెదలకుండా డిజిటల్ అరెస్ట్" చేసిన భయభ్రాంతులకు గురి చేశారు.
ఫోన్ కెమెరాను స్విచ్ ఆన్‌లో ఉంచమని ఆదేశించారు. ఆ తరువాత సీబీఐ ఢిల్లీ ఆఫీసునుంచి IPS అధికారిణిగా చెప్పుకుంటూ మరొకాల్ వచ్చింది. మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు కాబట్టి మిమ్మల్ని 'హోమ్ అరెస్ట్' లేదా 'జైలు అరెస్ట్'లో ఉంచుతామని చెప్పారు. అలా వారికి సంబంధించిన అన్ని బ్యాంక్ , ఆధార్ వివరాలను సేకరించి, ఐదు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు. అలా ఈ దంపతుల పొదుపు మొత్తాన్ని, వారి కుమార్తెలు విదేశాల నుండి పంపిన డబ్బులు కలిపి మొత్తం రూ.1.19 కోట్లు కొట్టేశారు. ఇక అప్పటినుంచి కాల్స్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో మోసపోయామని గ్రహించి, వారి కుమార్తెలలో ఒకరిని సంప్రదించారు, వారు నేరాన్ని పోలీసులకు నివేదించమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పూణే సైబర్ పోలీసులకు చెందిన సీనియర్ ఇన్‌స్పెక్టర్ అందించిన వివరాల ప్రకారం "డిజిటల్ అరెస్ట్" స్కామ్‌లో తాము మోసపోయామని గ్రహించిన సదరు అధికారి అక్టోబర్ 22న ఆ షాక్‌లో, ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. దీనిపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జీవితాంతం పొదుపు చేసిన డబ్బును పోగొట్టుకోడం, స్కామర్ల వేధింపుల కారణంగా తన భర్త తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని , అదే ఆయన ప్రాణాలు తీసిందని వాపోయింది.
సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరికలు
ఫోన్ కాల్ ద్వారా ఎవరినీ "అరెస్టు" అనేది జరగదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అంటున్నారు సైబర్ క్రైమ్ పరిశోధకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎపుడూ ఎవరికీ, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దని, ఈ వివరాలు లేదా డబ్బును డిమాండ్ చేసే హక్కు ఏ అధికారికీ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్‌పట్ల భయపడకుండా, అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. మోసగాళ్ళు చిన్న నగరాల నుండి సిమ్ కార్డులు, VPN నెట్‌వర్క్‌లను ఉపయోగించి తమ గుర్తింపును దాచిపెడుతున్నారన్నారు.
చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్‌ఆర్‌ఐ సక్సెస్ స్టోరీ


