చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.
పంజాబ్‌కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్‌గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది.
అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్‌గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.
పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్‌లతో సొంత డిస్పాచ్ సెటప్‌తో డ్రైవర్స్ నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్‌ఫామ్ సొల్యూషన్స్‌గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్‌షాప్ & బియర్డ్ స్టైలిస్ట్‌ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్‌ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
వ్యాపారం ఇలా మొదలైంది.
75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్‌కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్‌ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.
కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్‌లెట్‌లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్‌లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్‌వర్క్, బార్బర్‌ల కోసం బుకింగ్ యాప్‌ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.


