కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్‌ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన

Raj Thackeray Tweets Day After Uddhav Thackeray Unseated - Sakshi

పేరు ప్రస్తావించకుండా ట్విటర్‌లో నర్మగర్భ వ్యాఖ్యలు

అధికారం శాశ్వతం కాదంటూ ఉద్ధవ్‌కు రాసిన లేఖను తిరిగి పోస్ట్‌చేసిన ఎమ్మెన్నెస్‌ చీఫ్‌  

సాక్షి, ముంబై: నాటకీయ పరిణామాల మధ్య శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ విషయాన్ని భాగోద్వేగంతో బుధవారం రాత్రి ప్రకటించారు. దీనిపై ఇటు మహావికాస్‌ ఆఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు, సొంత పార్టీ శివసేన నాయకులు, సంజయ్‌ రావుత్, ఇతర పార్టీల పదాధికారుల నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ  ఉద్ధవ్‌ సోదరుడు, ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి రాజ్‌ ఠాక్రే నుంచి ఉద్ధవ్‌ను ఓదార్చడం, బాధ, ఆవేదన, సానుభూతిలాంటి ఎలాంటి స్పందనలు రాలేదు.

ఒకవేళ రాజ్‌ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరకు ఉద్ధవ్‌ రాజీనామా చేసిన 15 గంటల తరువాత అంటే.. గురువారం ఉదయం ఎట్టకేలకు రాజ్‌ ట్విటర్‌లో స్పందించారు. అందులో ఉద్దవ్‌ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కాని పరోక్షంగా వ్యాఖ్యలు మాత్రం ఆయనపై చేశారు. ‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, అధికారం చేతిలో ఉంది కదాని విర్రవీగితే పరిస్ధితులు ఇలాగే ఉంటాయి’ అని చురకలంటించారు. మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను తొలగించాలని అప్పట్లో రాజ్‌ చేసిన ప్రకటన చర్చల్లోకి వచ్చింది.
చదవండి: నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్‌ వార్నింగ్‌

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న లౌడ్‌స్పీకర్లను తొలగించాలని ఆందోళన చేస్తున్న, మసీదుల ఎదుట హనుమాన్‌ చాలీసా వినిపిస్తున్న ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజ్‌ ఠాక్రే ఆఘాడి ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు ఒక లేఖ రాశారు. అందులో నేను మీకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు, అధికారం ఇవ్వాళ ఉంటుంది. రేపు పోతుంది. అధికారాన్ని పుట్టుకతోనే అమ్మ కడుపులోంచి ఎవరు తెచ్చుకోలేదు. ఉద్ధవ్‌ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు నెలన్నర కిందట రాసిన ఆ లేఖను గురువారం మళ్లీ ట్విటర్‌లో పెట్టారు. అప్పట్లో ఈ విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top