
ఓట్ల చోరీపై వీడియో విడుదల చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్ బూత్‌లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్‌మాల్‌పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు.
వీడియోలో ఏముంది?
కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్‌పై ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే నేమ్‌బోర్డు ప్రత్యక్షం అవుతుంది.
నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.