నిజమైన కులగణన అనుమానమే: రాహుల్‌  | Rahul doubts intention of Narendra Modi on caste census | Sakshi
Sakshi News home page

నిజమైన కులగణన అనుమానమే: రాహుల్‌ 

Jun 7 2025 6:15 AM | Updated on Jun 7 2025 6:15 AM

Rahul doubts intention of Narendra Modi on caste census

రాజ్‌గిరి: కేంద్రం చేపట్టే కులగణన సర్వేపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ఓబీసీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన అధికారులు లేకుండానే ప్రశ్నావళిని ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. ‘వాస్తవ కులగణనను మోదీ ప్రభుత్వం చేపట్టదు. ఎందుకంటే, అలాంటి కులగణనతో బీజేపీ రాజకీయాలు ముగిసిపోవడం ఖాయం. 

కులగణనకు బీజేపీ మోడల్, తెలంగాణ మోడల్‌ అనే రెండున్నాయి. బీజేపీ మోడల్‌లో అధికారులంతా ఓ గదిలో కూర్చుని ప్రశ్నావళిని ఖరారు చేస్తారు. ఇందులో ఓబీసీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన అధికారులుండరు. కేవలం ఎంపిక చేసిన అధికారులు మాత్రమే ఉంటారు’అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. నలంద జిల్లా రాజ్‌గిర్‌లో శుక్రవారం జరిగిన సంవిధాన్‌ సురక్షా సమ్మేళన్‌లో రాహుల్‌ మాట్లాడారు.

 భారత్, పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల సమయంలో జోక్యం చేసుకుని శాంతి నెలకొనేలా చేశానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలుమార్లు ప్రకటించినా ప్రధాని మోదీ మౌనముద్ర దాల్చారంటూ ఆయన ఆరోపించారు. ‘శాంతికి, న్యాయానికి నెలవుగా ఒకప్పుడు పేరుగాంచిన బిహార్‌ నేడు నితీశ్‌ సారథ్యంలోని ఎన్డీయే పాలనలో దేశ నేర రాజధానిగా మారిపోయిందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement