ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం: ఇంతకీ నూపుర్‌ శర్మ ఇప్పుడు ఎక్కడ?

Prophet Comments BJP Suspended Leader Nupur Sharma Tight Security - Sakshi

ఓ టీవీ షో డిబేట్‌లో ముహమ్మద్‌ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్‌ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. అవుతోంది కూడా. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగానూ బీజేపీ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది.      

వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. బీజేపీ ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అంతేకాదు తన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా తెలియజేసింది. అయినా వివాదం చల్లారడంలేదు. నూపుర్‌ శర్మ పేరు ప్రతీరోజూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌ వినిపిస్తూనే ఉంది. మరి.. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. 


  
ప్రవక్తపై కామెంట్ల తర్వాత.. చంపేస్తామంటూ బెదిరింపులు, వేధింపులు ఆమెకు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఆమె పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కొన్ని ఉగ్రసంస్థలు సైతం ఆమెపై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఈ తరుణంలో.. ఢిల్లీ పోలీసులు ఆమెకు భారీ భద్రతను అందించారు. కుటుంబంతో పాటు నూపుర్‌ బలమైన సెక్యూరిటీ నడుమ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మే 26వ తేదీన జ్ఞానవాపి మసీద్‌ వ్యవహారంపై టీవీ చర్చ సందర్భంగా ఆమె.. ప్రవక్త వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఇస్లాం వర్గాల అభ్యంతరాలతో దుమారం చెలరేగింది.  అప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు. బీజేపీ అగ్రశ్రేణి నేతలకు వివరణ ఇచ్చేందుకు యత్నించినా.. సానుకూల స్పందన లభించలేదు. దీంతో ఆమె కొంతమంది నేతలతో ఫోన్‌ ద్వారా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఆపై మీడియాకు సైతం అంతగా అందుబాటులోకి రాని నూపుర్‌.. సోషల్‌ మీడియా ద్వారానూ సదరు వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. కానీ, సోషల్‌ మీడియా అకౌంట్లలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటూ.. పోస్టులు చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందునా.. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నూపుర్‌ కుటుంబ భద్రతను సవాల్‌గా తీసుకుంటున్నారు.

నూపుర్‌ శర్మ(37) ఢిల్లీలోని పుట్టి, పెరిగారు. సివిల్స్‌ సర్వెంట్స్‌ నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది. బీఏ, ఎల్‌ఎల్‌బీ, లండన్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ లా చేశారామె. ఏబీవీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆమె(ప్రెసిడెంట్‌గానూ 8 ఏళ్లు పని చేశారు).. విద్యార్థి దశలోనే టీవీ డిబేట్ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. చివరకు.. బీజేపీ నేతగా ఉన్న టైంలోనే టీవీ డిబేట్‌ ద్వారానే ఆమె వివాదంలోనూ చిక్కుకోవడం గమనార్హం. అయితే ఈ కష్టకాలంలో బీజేపీ ఆమెకు అండగా నిలబడడం లేదంటూ.. #ShameOnBJP #IsupportNupurSharma హ్యాష్‌ట్యాగులూ  ఈమధ్యకాలంలో ట్రెండ్‌ అవుతుండడం విశేషం. మరోవైపు కొన్ని ఇస్లాం సంఘాలు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ పిలుపు ఇస్తున్నా.. మరికొన్ని వర్గాలు మాత్రం చల్లారడం లేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top