పేదరికరహిత భారత్‌ | Sakshi
Sakshi News home page

పేదరికరహిత భారత్‌

Published Wed, Feb 1 2023 4:12 AM

President Droupadi Murmu: We Have To Build An Atmanirbhar India By 2047 - Sakshi

న్యూఢిల్లీ: ‘‘కేంద్రంలో నిర్భీతితో కూడిన సుస్థిరమైన, నిర్ణాయక ప్రభుత్వముంది. మన ఘన వారసత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశాభివృద్ధికి, అన్ని వర్గాల వారి అభ్యున్నతికి నిష్పాక్షికంగా పాటుపడుతోంది. విప్లవాత్మక నిర్ణయాలతో ప్రతి విషయంలోనూ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె తొలిసారి ప్రసంగించారు. 2047కల్లా పేదరికరహిత దేశంగా భారత్‌ స్వావలంబన సాధించేలా చూడటమే నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అతి పెద్ద శత్రువైన అవినీతిపై నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తోందని గుర్తు చేశారు.

ఫలితంగా అవినీతిపరులపై ఎలాంటి సానుభూతీ చూపొద్దన్న సామాజిక స్పృహ పెరుగుతోందన్నారు. ఆత్మనిర్భర భారతాన్ని సాకారం చేసేందుకు వచ్చే పాతికేళ్ల అమృత కాలంలో ప్రజలంతా తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ విజయాలను రంగాలవారీగా గణాంకాల సాయంతో వివరిస్తూ రాష్ట్రపతి గంట పైగా ప్రసంగించారు. ముఖ్యాంశాలు... 

►మోదీ సర్కారు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో విజయాలు, సానుకూల మార్పులు సాధించింది. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో ఇనుమడింపజేయడం వాటిలో ముఖ్యమైనది. 

►సమున్నత ఆకాంక్షలతో గొప్ప లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించే దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. నిజాయతీకి పెద్దపీట వేస్తోంది. భారీ కుంభకోణాలు, ప్రభుత్వ పథకాల అమలులో అంతులేని అవినీతికి మంగళం పాడాలన్న జనాకాంక్షలను నిజం చేసి చూపిస్తోంది. 

►పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి వారిని సాధికారపరిచేందుకు కృషి చేస్తోంది. 

►ఇన్నొవేషన్, టెక్నాలజీలను ప్రజా సంక్షేమానికి సమర్థంగా వినియోగిస్తూ కనీవినీ ఎరగని వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా పేదలకు రోజుకు 11 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 55 వేల గ్యాస్‌ కనెక్షన్లు అందుతున్నాయి. ఒక్క ముద్రా పథకం ద్వారానే రోజూ రూ.700 కోట్లకు పైగా రుణాలందుతున్నాయి. 300 పై చిలుకు పథకాల ద్వారా లబ్ధిదారులకు ఖాతాల ద్వారా నేరుగా నగదు అందుతోంది. 

►ప్రజలకు దశాబ్దాల పాటు కలగానే మిగిలిన మౌలిక సదుపాయాలెన్నో పరిపూర్ణంగా అందుతున్నాయి. 

►అటు సాంకేతికంగా, ఇటు సాంస్కృతికంగా దేశంలో అద్భుతమైన ప్రగతి చోటుచేసుకుంటోంది. మన డిజిటల్‌ ప్రగతి అభివృద్ధి చెందిన దేశాలకూ ఆదర్శంగా మారింది. 

►అవసరాలకు అనుగుణంగా సత్వరం విధానాలను, వ్యూహాలను సమూలంగా మార్చుకునే ప్రభుత్వ సంకల్ప శక్తికి సర్జికల్‌ దాడులు మొదలుకుని ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ల రద్దు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, నియంత్రణ, వాస్తవాధీన రేఖల వద్ద శత్రువుల ప్రతి దుస్సాహసానికీ దీటుగా బదులివ్వడం వంటివన్నీ తార్కాణాలుగా నిలిచాయి. సైన్యాన్ని ఆధునీకరించేందుకు పెద్దపీట వేశాం. 

►ఫలితంగా విధాన వైకల్యంతో కుంగిపోయే రోజులు పోయి శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా రాణిస్తూ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. 

►అంతర్జాతీయ వేదికపైనా తనదైన కీలక పాత్ర పోషించేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. సమస్యల పరిష్కారానికి ఇతర దేశాల వైపు చూసే స్థితి నుంచి ప్రతిష్టాత్మక జి–20 కూటమి సారథిగా ప్రపంచ సమస్యల పరిష్కారానికి నడుం బిగించే స్థాయికి ఎదిగింది. 

►రక్షణ, వైమానిక రంగాల్లోనూ గొప్ప ప్రగతి సాధించాం. అగ్నివీర్‌ పథకం యువతకు దేశ సేవ చేసేందుకు గొప్ప అవకాశంగా మారింది. 

►మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది. ఫలితంగా సైన్యంతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. తొలిసారిగా మహిళల జనాభా పురుషులను మించిపోయింది. పీఎం కిసాన్‌ లబ్ధిదారుల్లోనూ 3 లక్షలకు పైగా మహిళలే! 

►బంజారాలు, ఇతర సంచార జాతుల సంక్షేమానికి తొలిసారిగా బోర్డు ఏర్పాటైంది. 

►అటు అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఇటు అత్యాధునిక పార్లమెంటు భవన నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక, యాత్రా స్థలాల అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోంది. 

►మన యోగ, ఆయుర్వేదం ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. 

►శిలాజేతర వనరుల ద్వారా 40 శాతం విద్యుదుత్పాదన లక్ష్యాన్ని తొమ్మిదేళ్లు ముందే చేరుకున్నాం. 

►ఉగ్రవాదంపై మనం తీసుకున్న కఠిన వైఖరిని ప్రపంచమంతా స్వాగతిస్తోంది. 

►ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా జనాభాలో ఏకంగా 50 కోట్ల మందికి ఉచిత చికిత్స అందింది. ప్రజలకు రూ.80 వేల కోట్లు మిగిలాయి.

కొత్తదనం కొరవడింది రాష్ట్రపతి ప్రసంగంపై ఖర్గే  
బీజేపీ సర్కార్‌ ఎప్పుడూ చెప్పే విషయాలనే మళ్లీ రాష్ట్రపతి తన ప్రసంగం ద్వారా పునరుద్ఘాటించారని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. ‘దేశం అద్భుతంగా పురోగమించిందని రాష్ట్రపతి ప్రసంగం ద్వారా కేంద్రం చెప్పించింది. అదే నిజమైతే అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పేదలు ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? పథకాల ఫలాలు ఎందుకు అణగారిన వర్గాల దాకా చేరడం లేదు? కొత్త కాలేజీలు, స్కూళ్లన్నీ ప్రైవేటురంగంలో వచ్చినవే.

వాటి భారీ ఫీజుల వల్ల పేదలకు ఎలాంటి లబ్ధిచేకూరలేదు’ అని ఆరోపించారు. అవినీతి అంతమైతే ఒకే వ్యక్తి రూ.1 లక్ష కోట్ల విలువైన షేర్ల పెట్టుబడుల ద్వారా ఎల్‌ఐసీ/ఎస్‌బీఐలను ఎలా మభ్యపెట్టగలిగాడు? మోదీకి ఆప్తుడైన ఆ ఒక్కడి చేతిలోకే తమ పెట్టుబడులు తరలిపోయాయని 30 కోట్ల మంది గగ్గోలు పెడుతున్నారు’’ అంటూ ఖర్గే విమర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement