ఆరుగురు తెలుగువారికి జాతీయ అవార్డులు 

President Droupadi Murmu Gives Away Sangeet Natak Akademi Awards - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంగీతం సముద్రమంత విశాలమైనదని, మన నాటకాలు అజరామరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సంగీత, నాటకాల ద్వారా భారత సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న కళాకారుల జీవితాలు ధన్యమన్నారు. గురువారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంగీత, నాటక అకాడెమీ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. కరోనా కారణంగా 2019, 2020, 2021 సంవత్సరాలకు అందించని జాతీయ సంగీత, నాటక అకాడెమీ అవార్డులను గురువారం ముర్ము, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విజేతలకు అందించారు.

మొత్తం 128 మంది కళాకారులకు అవార్డులు ఇవ్వగా, ఇందులో 50 మంది మహిళలే ఉండటం ఈ రంగాల్లో స్త్రీశక్తి చేస్తున్న సేవకు నిదర్శనమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కళా, సంగీత సేవ చేస్తున్న ఆరుగురికి అవార్డులు దక్కాయి. హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరి(హరికథ), కథక్‌ నృత్యకారులు రాఘవరాజ్‌ భట్, మంగళభట్‌(సంయుక్తంగా) 2019 సంవత్సరానికిగాను ఈ అవార్డులు అందుకున్నారు.

2020 సంవత్సరానికి కర్ణాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, ప్రఖ్యాత గాయని ప్రేమరామ్మూర్తి, కూచిపూడి నృత్యకళాకారులు పసుమర్తి విఠల్, పసుమర్తి భారతి దంపతులు(సంయుక్తంగా) అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరానికిగాను తెలుగులో నాటకరంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్న శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) నిర్వాహకులు ఆర్‌.వేణుగోపాల్‌ రావు సంగీత, నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top