కష్టమైన పనులను గాలికొదిలేసింది | PM Narendra Modi Unveils 5,100 Crore Development Projects In Arunachal | Sakshi
Sakshi News home page

కష్టమైన పనులను గాలికొదిలేసింది

Sep 23 2025 5:26 AM | Updated on Sep 23 2025 5:26 AM

PM Narendra Modi Unveils 5,100 Crore Development Projects In Arunachal

అది ఆ పార్టీకి వారసత్వంగా వచ్చిన అలవాటు 

అందుకే ఈశాన్యభారతం ఎంతో కోల్పోయింది 

కాంగ్రెస్‌పై ప్రధాని ధ్వజం 

త్రిపుర, అరుణాచల్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన  

ఈటానగర్‌/అగర్తలా: ఈశాన్య భారతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఈశాన్యభారతంలో పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రూ.5,100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటానగర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం రెండు లోక్‌సభ స్థానాలే ఉన్నాయి. 

రాజకీయంగా ఈ రెండు సీట్లతో తమకు ఎలాంటి ప్రయోజనంలేదని కాంగ్రెస్‌ ఎప్పుడో భావించింది. ఈశాన్యభారతంలో కష్టమనిపించిన ఏ అభివృద్ధి ప్రాజెక్టు, పనినీ కాంగ్రెస్‌ భుజాలకెత్తుకోలేదు. కొండలు, అటవీప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం సవాళ్లతో కూడిన పని. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. అభివృద్ధి పనులను వదిలేసే కాంగ్రెస్‌ ని్రష్కియాపర్వం కారణంగా ఈశాన్యభారతం అభివృద్ధికి అస్సలు నోచుకోలేదు. 

ఇలా పనులను గాలికొదిలేయడం కాంగ్రెస్‌కు వారసత్వంగా వచ్చిన దురలవాటు. కాంగ్రెస్‌ కారణంగా నిర్లక్ష్యానికి గురైన అరుణాచల్‌ప్రదేశ్‌ను ఢిల్లీలో కూర్చుని పరిపాలిస్తే సరిపోదని నాకు అర్థమైంది. అందుకే రాష్ట్రానికి తరచూ కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను పంపించా. నేను కూడా ఈశాన్యభారతంలో ఇప్పటిదాకా 70 సార్లకుపైగా పర్యటించా. దశాబ్దకాలంలో చూస్తే మంత్రులు, అధికారులు 800 సార్లు పర్యటించారు. 

రహదారులు నిర్మించడం అసాధ్యమని కాంగ్రెస్‌ భావించిన అదే చోట్ల ఇప్పుడు ఆధునిక రహదారులను నిర్మించాం. సేతు టన్నెల్‌నే తీసుకోండి. ఒకప్పుడు అది సాధ్యమని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఇది అరుణాచల్‌ప్రదేశ్‌ గౌరవ గుర్తింపుగా నిలిచింది. హోలోంగి ఎయిర్‌పోర్ట్‌ సైతం కొత్త టరి్మనల్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి విమానసర్వీసులు ఉన్నాయి. ఈ అనుసంధాన ప్రాజెక్టులు ప్రయాణాలను సులభతరం చేశాయి. రైతులు తమ ఉత్పత్తులను పెద్ద మార్కెట్‌లకు తరలించగల్గుతున్నారు’’ అని మోదీ అన్నారు. 

ఆ ఆలోచనను మార్చాలనుకున్నా 
‘‘2014లో తొలిసారిగా ప్రధానిగా దేశ సేవచేసే అవకాశం వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నా. కాంగ్రెస్‌ భావజాల సుడిగుండం నుంచి దేశాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్నా. ఏ రాష్ట్రంలోనైనా మా మార్గదర్శకం ఓట్లు, సీట్లు్ల కావు. దేశమే ముఖ్యం అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఎవరి గురించి అయితే ఎవరూ పట్టించుకోలేదో వాళ్లనే మోదీ పట్టించుకుంటాడు. అదే అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం. అందుకే 2014 నుంచి అభివృద్ధికి కొత్త కేంద్రంగా అరుణాచల్‌ప్రదేశ్‌ను మలిచా. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. 

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలుంటే కలిగే డబుల్‌ ప్రయోజనాలకు అరుణాచల్‌ ఒక మచ్చుతునక. ఈరోజు ప్రకటించిన పలు విద్యుత్‌ ప్రాజెక్టులు పూర్తయ్యాక రాష్ట్రం ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లుతుంది. రూ.1,750 కోట్ల వ్యయంతో 80.2 కోట్ల యూనిట్ల వార్షిక విద్యత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన టాటో–1 ప్రాజెక్ట్‌ పూర్తయితే వేలాది మందికి ఉపాధితోపాటు సరసమైన ధరలో విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది’’అని మోదీ అన్నారు. షియో మీ జిల్లాలో యార్జేప్‌ నదిపై రెండు భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. 

అలిగిన కూటమి పార్టీ 
త్రిపురలో మోదీ పాల్గొన్న కార్యక్రమాల్లో కనీసం తమకు ఆహ్వానం అందలేదని త్రిపుర రాష్ట్రంలో కూటమి సర్కార్‌లో భాగస్వామి అయిన ‘ది తిప్రా మోథా’ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ టీఎంపీ సీనియర్‌ ఎమ్మెల్యే రంజిత్‌ దేవ్‌వర్మ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘ త్రిపురేశ్వరీ ఆలయం ప్రాంగణంలో మోదీ చేపట్టిన పునరుద్ధరణ భవనాల ప్రారం¿ోత్సవాలు, పూజా కార్యక్రమాల్లో మా టీఎంపీ పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్‌ కిశోర్‌ మాణిక్య దేవ్‌వర్మను ఆహ్వానించలేదు. 

కూటమి సర్కార్‌లో సభ్యులై ఉండికూడా పార్టీ ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆలయాన్ని కట్టించిన మహారాజ ధన్య మాణిక్య రాజవంశానికే చెందిన రాజమాత విభూ కుమారి దేవికి సైతం ఆహ్వానం అందలేదు’’ అని దేవ్‌వర్మ అసహనం వ్యక్తంచేశారు. 1949 సెపె్టంబర్‌లో నాటి భారత సర్కార్, రాణి కంచన్‌ ప్రవదేవీల మధ్య ఒడంబడిక కుదిరేనాటికి ఈ ఆలయం ఈ వంశస్తుల అధీనంలోనే ఉందని దేవ్‌వర్మ గుర్తుచేశారు. మాకూ ఆహ్వానం అందలేదని మరో కూటమి పార్టీ ఇండీజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర ఆగ్రహం వ్యక్తం చేసింది.  

స్వయం సహాయక సంఘాల ప్రతినిధులతో మాటామంతీ 
అరుణాచల్‌ రాజధాని ఇటానగర్‌లో ఇందిరాగాంధీ పార్క్‌లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌నూ మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి స్వయంసహాయక సంఘాల ప్రతినిధులు, స్థానిక వ్యాపారులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తగ్గిన జీఎస్‌టీతో మీకు ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయో వాళ్లను మోదీ స్వయంగా అడిగి తెల్సుకున్నారు. ‘‘ స్థానిక వ్యాపార వర్గాలతో నేరుగా సంభాషించడం ద్వారా వాళ్లలో ఉత్సాహాన్ని పెంచడంతోపాటు వ్యాపారాన్ని మరింత అభివృద్ధిచేయాలని వాళ్లను ప్రోత్సహించా. ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయి నుంచి వ్యాపారమూలాలను మరింత బలోపేతం చేస్తాయి’’అని మోదీ ఆ తర్వాత అన్నారు. 

జీఎస్‌టీ ద్వారా ఒకే దేశం, ఒకే పన్ను భావనను తీసుకొచ్చి పాత పలురకాల పన్నులకు ప్రధాని మోదీ చరమగీతం పాడారని అక్కడి స్థానిక వ్యాపారులు గుర్తుచేసుకున్నారు. జీఎస్‌టీ తగ్గడంతో నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుందని, దీంతో గృహనిర్మాణ ఖర్చులు కలిసొస్తాయని స్థానిక వ్యాపారులు మోదీతో చెప్పారు. ముడిసరుకులు తక్కువ ధరకు లభిస్తాయని, దీంతో స్థానిక ఉత్పత్తుల తయారీ వ్యయం తగ్గనుందని ఆదాయం పెరిగే అవకాశముందని వాళ్లు మోదీతో అన్నారు. వికసిత్‌ భారత్‌ సుసాధ్యం కావాలంటే మీరంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని, స్వదేశీ వస్తువులనే అమ్మాలని వాళ్లకు మోదీ సూచించారు.

త్రిపురేశ్వరీ ఆలయంలో పూజలు 
త్రిపురలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ గోమతీ జిల్లాలోని ప్రఖ్యాత త్రిపురేశ్వరీ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీర్థయాత్ర కాయకల్ప, అభివృద్ధి(ప్రసాద్‌) పథకంలో భాగంగా రూ.52 కోట్లతో చేపట్టిన త్రిపురేశ్వరీ ఆలయ మరమ్మతు పనులు పూర్తయిన సందర్భంగా మోదీ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ‘మహారాజా’ ధన్య మాణిక్య 1501 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 

500 సంవత్సరాల ఘనచరిత గల ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భక్తులు కొలుస్తారు. సోమవారం ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు కలియతిరిగారు. త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్‌సాహా, సీనియర్‌ ఉన్నతాధికారులు మోదీకి ఆలయ విశిష్టతను వివరించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆలయ ప్రత్యేకతను చాటే ఎగ్జిబిషన్‌నూ మోదీ సందర్శించారు. మండే ఎండలోనూ మోదీని చూసేందుకు జనం ఎగబడ్డారు. గత 11 సంవత్సరాల్లో త్రిపురకు మోదీ రావడం ఇది 11వ సారి కావడం విశేషం.

 ‘11 ఏళ్లలో మోదీ 11 సార్లు త్రిపురకు వచ్చారు. నవరాత్రి తొలిరోజున భక్తిశ్రద్ధలతో మోదీ సంప్రదాయ ధోతీలో మాతా త్రిపురసుందరిని దర్శించుకున్నారు’ అని ఎంపీ బిప్లవ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రసాద్‌ పథకంలో భాగంగా ఆలయ కాంప్లెక్స్‌లో భక్తులు సేదతీరేందుకు పెద్ద హాల్, వేచి ఉండే గది, ధ్యానం హాల్, పూజారి గది, మ్యూజియంలను నిర్మించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక గది ఏర్పాటుచేశారు. ఒకేసారి రెండు లక్షల మంది భక్తులు సందర్శించినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా 30,000 చదరపు అడుగుల్లో ఏర్పాట్లు చేశారు. దీపావళి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి మరీ విపరీతంగా ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement