
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదాని హిమాచల్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర అధికారులను కలుసుకుంటారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వరద బాధితులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), ఆప్దా మిత్ర బృందంతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్ సర్వే నిర్వహించాక, గురుదాస్‌పూర్ చేరుకుని, సాయంత్రం 4:15 గంటలకు సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.
హిమాచల్‌లో వరదల కారణంగా 355 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం కారణంగా ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. మరోవైపు బియాస్, సత్లుజ్, రావి, ఘగ్గర్ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పంజాబ్ హై అలర్ట్‌లో ఉంది. 23 జిల్లాల్లోని 1,650 కి పైగా గ్రామాలు నీట మునిగాయి, 1.75 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి.