26/11 దాడి తరహాలో మరో ఉగ్రదాడికి భారీ ప్లాన్‌!

Pm Conducts Review Meeting On Nagrota Encounter - Sakshi

సాక్షి,ఢిల్లీ: రెండు రోజుల క్రితం జమ్మూలో జరిగిన నగ్రోటా ఎన్‌కౌంటర్‌పై ప్రధాన మంత్రి మోదీ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌తో  సమీక్ష సమావేశాన్నినిర్వహించారు. ఈ సమీక్షలో భారత ఉన్నత నిఘా సంస్థ, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా పాల్గొన్నారు. 26/11 ఉగ్రదాడి జరిగి 12 ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో భారత్‌లో మరో భారీదాడి చేయాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు మోదీకి అధికారులు వివరించారు.(చదవండి: భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం)

ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. జైష్-ఇ-మహమ్మద్‌ ఉగ్రవాద దాడిపై  భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ భూభాగం నుంచి  ఉగ్రవాదులకు అందిస్తున్న సాయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. జాతీయ భద్రతను కాపాడుకోవాడానికి అవసరమైన చర్యలు తీసుకోవాడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

మోదీ అభినందన..
"పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చి, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో విధ్వంసాలను చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బలగాలు మరోసారి అడ్డుకున్నాయని" ప్రధాని మోదీ తన ట్వీట్‌లో ప్రశంసించారు.

రాబోయే స్థానిక ఎన్నికలే లక్ష్యంగా..
జమ్మూలో  నగ్రోటా పట్టణానికి సమీపంలో భద్రతా దళాలతో గురువారం జరిగిన కాల్పుల్లో  నలుగురు ఉగ్రవాదులు మృతి  చెందిన విషయం తెలిసిందే. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 22 వరకు జమ్మూలో జరిగే జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల్లో భాగంగా భారీకుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భద్రతా దళాలకు  సమాచారం అందిందని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు.

జమ్మూ జిల్లాలోని నగ్రోటా పట్టణానికి సమీపంలో హైవేపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన మూడు గంటల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల్లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజి)కు చెందిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులతో ప్రయాణిస్తున్న ట్రక్కును భద్రతా దళాలు అడ్డగించడంతో కాల్పులు ప్రారంభమయ్యాయి. 11 ఎకె -47  రైఫిళ్లు, మూడు పిస్టల్స్, 29 గ్రెనేడ్లు, ఆరు యుబిజిఎల్ గ్రెనేడ్లు, మొబైల్ ఫోన్లు, దిక్సూచి, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు  ముఖేష్ సింగ్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top