అదానీ వ్యవహారం: పార్లమెంట్‌లో మళ్లీ గందరగోళం.. ఉభయసభలు సోమవారానికి వాయిదా

Parliament Budget Session Live Updates: high drama over Adani row - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్‌ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను సజావుగా సాగనిచ్చేలా కనిపించడం లేదు. సమావేశాల్లో నాలగవ రోజైన శుక్రవారం ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లోక్‌సభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తునన్నట్లు స్పీకర్ ప్రకటించారు.

మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అంతకుముందు అదానీ-హిడెన్‌బర్గ్‌ విషయంలో పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాల దాడులను ఎలా తిప్పి కొట్టాలి అనే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు బీజేపీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్షాల అత్యవసర సమావేశం జరిగింది. ఆప్‌, బీఆర్‌ఎస్‌లు సైతం ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఇరు సభల్లో విడివిడిగా అదానీ-హిడెన్‌బర్గ్‌ వ్యవహారంపై వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చింది బీఆర్‌ఎస్‌. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఆప్‌ కూడా నోటీసులు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అదానీ-హిడెన్‌బర్గ్‌ నివేదికపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top