ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ చోటుచేసుకున్న పరిస్థితులపై ఇవాళ రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఇరాన్ యుద్దానికి పరిష్కారమని, ఉద్రిక్తత తగ్గించేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందని అన్నారు. దేశం ఐక్యంగా ఉంటే ఏ సవాలునైనా ఎదుర్కోగలమని తెలిపారు.
‘యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌కు ఆర్థిక, భద్రత, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు 3.75 లక్షల భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి సుమారు 1,000 మంది భారతీయులను తరలించాం. అందులో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.
విదేశాల్లోని భారత మిషన్లు 24/7 సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. హెల్ప్‌లైన్‌లు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం కష్టతరం. అయినప్పటికీ ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి.
ప్రస్తుతం 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుగుతున్నాయి. ఎల్పీజీలో దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాం. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల చమురు దిగుమతులు తగ్గిస్తున్నాం. రైల్వే విద్యుతీకరణతో డీజిల్ వినియోగం తగ్గిస్తున్నాం.
ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీలో భారత్ పురోగతి సాధించింది. తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులందరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని మోదీ చెప్పారు.


