పరీక్షలు ఒక్కటే జీవితం కాదు: మోదీ

Pariksha Pe Charcha Narendra Modi Talk With Students Through Video Conference - Sakshi

అమ్మాయి, అబ్బాయిల మధ్యఅసమానత ఉండరాదు

పరీక్షా పే చర్చా–2021 కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాన మంత్రి 

మోదీని ప్రశ్న అడిగిన ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన విద్యార్థిని పల్లవి

సాక్షి, న్యూఢిల్లీ: పరీక్షల్లో వచ్చే మార్కులు మాత్రమే మేధస్సుకు కొలమానం కాదనే విషయాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షల్లో మంచి మార్కులు రాని చాలామంది కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు ప్రధాని మోదీ 2018 నుంచి ఏటా ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికిగాను బుధవారం వర్చువల్‌ వేదికగా జరిగిన ‘పరీక్షా పే చర్చా–2021’కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సావధానంగా సమాధానం ఇచ్చారు. పలు కీలక సూచనలు చేశారు.

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి...
పరీక్షల ముందు విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలని ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని ప్రధాని మోదీని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రధాని.. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరీక్షలు వస్తాయని ముందే తెలిసినప్పుడు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు అనవసర ఒత్తిడిని పెంచొద్దని చెప్పారు.

చిన్నారులతో ఎక్కువ సమయం గడపాలని, తద్వారా వారిలోని లోటుపాట్లు తెలుసుకొని సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని తల్లిదండ్రులకు సూచించారు. అర్థంకాని కొన్ని సబ్జెక్టుల నుంచి పారిపోకుండా దీటుగా ఎదుర్కొన్నప్పుడే విద్యార్థులు విజయం సాధించగలరని చెప్పారు. అధ్యాపకులు సైతం కఠినమైన విషయాలను విద్యార్థులకు ఓపికగా వివరించాల్సిన అవసరం ఉందని, అలా చేస్తే కఠినమైన సబ్జెక్టులపై విద్యార్థుల్లో భయం దూరమవుతుందని తెలిపారు. 

అసమానతలు వద్దు
ఇళ్లలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య చూపించే అసమానతల కారణంగా పిల్లల మనసులపై తీవ్ర ప్రభావం ఉంటుందని, తల్లిద్రండులు ఈ విషయంలో జాగ్రత్త పాటించాలని మోదీ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను పిల్లలు సాధించే పరిస్థితి లేనప్పుడు వారిని నిందించడం తగదన్నారు. ఏ విషయమైనా పిల్లలకు తర్కబద్ధంగా నేర్పించేందుకు అవసరమైన వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాల్సిన అవసరం తల్లిదండ్రులకే ఉందని చెప్పారు.

ఏ విషయంలోనైనా పిల్లలు తమకు తామే ప్రేరణ పొందాల్సిన అవసరం ఉందని.. తల్లిదండ్రులు చిన్నారుల్లో ఆశావహ దృక్పథాన్ని పెంచాలే తప్ప, భయాన్ని పెంచకూడదని మోదీ స్పష్టం చేశారు. ఈ మధ్య సెలబ్రిటీ కల్చర్‌ పెరిగిపోయి, ప్రసార మాధ్యమాల్లో కనిపించే వారిలా తాము మారాలని కోరుకుంటున్నారని.. కానీ ఎవరైనా తమకున్న స్కిల్స్‌ను మెరుగుపర్చుకుంటూ ప్రపంచంలోని అనేక అవకాశాలను అందుకొనేలా సిద్ధం కావాలని సూచించారు.

పరీక్షా కేంద్రం బయటే వదిలేయండి
పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులు తమకున్న ఆందోళనను పరీక్షా కేంద్రం బయటే విడిచిపెట్టాలని మోదీ సూచించారు. ఎగ్జామ్‌ వారియర్‌ పుస్తకంలో తను రాసిన సలహాలు, సూచనలు విద్యార్థులకే కాకుండా ప్రతీ ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటాయని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదిగా ఏవైతే కోల్పోయామో, వాటికంటే ఎక్కువ తెలుసుకున్నామని మోదీ చెప్పారు. అతి తక్కువ వసతులతో ఎలా జీవించగలమో కరోనా మనకు నేర్పిందన్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పిన కరోనా.. మన మధ్య ఉండే భావోద్వేగాలను బలపరిచిందని చెప్పారు.

పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి
ఇటీవల సమాజంలో పెరుగుతున్న జనరేషన్‌ గ్యాప్‌ తగ్గించే విషయంలో తల్లిదండ్రులే కీలకపాత్ర పోషిస్తారని మోదీ అన్నారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారిని సంతోషపర్చేందుకు తల్లిదండ్రులు ఏర్పర్చిన స్నేహపూరిత వాతావరణాన్ని.. పిల్లలు పెద్దయ్యాక కూడా కొనసాగించేలా చూడాలన్నారు. 

సాంప్రదాయ ఆహారం ప్రాధాన్యత తెలపండి
సాంప్రదాయ ఆహారంపై చిన్నారులకు గౌరవం పెరిగేలా చూడాలని మోదీ పిలుపునిచ్చారు. ఆరోగ్యకర ఆహారం ప్రాధాన్యతను పిల్లలు తెలుసుకొనేలా ఏదైనా గేమ్‌ సిద్ధంచేసి, కనీసం వారానికోసారి అయినా ఆడించే ప్రయత్నం చేయాలన్నారు. సాంప్రదాయ ఆహారంలోని పోషక విలువల గురించి మన ఫ్యామిలీ డాక్టర్‌తో, స్కూల్‌ టీచర్లతో చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలు పూర్తయ్యాక.. తమ రాష్ట్రాల్లో స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధమున్న 75 ఘటనలను మాతృభాషలో రాసే ప్రక్రియను ఏడాది పాటు ప్రాజెక్టు మాదిరిగా చేపట్టాలని కోరారు.

  • ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పరీక్షలు వస్తాయని ముందే తెలిసినప్పుడు ఒత్తిడి పెంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు.పరీక్షలు, మార్కులు అనే అంశాలను కొందరు జీవన్మరణ సమస్యగా మారుస్తున్నారు.. ఆ ఆలోచనల్లో మార్పు రావాలి. ఏదైనా విషయాన్ని చదివేటప్పుడు విద్యార్థులు ‘ఇన్వాల్వ్, ఇంటర్నలైజ్, అసోసియేట్, విజువలైజ్‌’ అనే నాలుగు అంశాలను పాటిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • విద్యార్థులు ఖాళీ సమయాన్ని తమకు ఇష్టమున్న ఇతర అంశాలకు కేటాయించి.. తమలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగించుకోవాలి.
  • కొందరు తల్లిదండ్రులు తాము నిర్దేశించుకున్న కలలు,లక్ష్యాలను పిల్లలపై రుద్ది..వాటిని సాధించేందుకు యంత్రాల్లా మార్చేస్తున్నారు.
  • చిన్నారులతో తల్లిదండ్రులు స్నేహితులుగా ఉండాలే తప్ప శిక్షకులుగా మారొద్దు. 

చదవండి: తల్లి చెప్పినా వినలే.. పరీక్ష రాస్తూ మృత్యుఒడిలోకి

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top