పేగుబంధమే యమపాశమై! | Parents who kill their children and commit suicide | Sakshi
Sakshi News home page

పేగుబంధమే యమపాశమై!

Jun 14 2026 5:10 AM | Updated on Jun 14 2026 5:10 AM

Parents who kill their children and commit suicide

పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్న తల్లిదండ్రులు 

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లతో దారుణ నిర్ణయాలు 

తాము లేకుంటే కష్టాల కడలిలో చిక్కుకుపోతారనే అపోహతో పిల్లలనూ బలితీసుకుంటున్న వైనం 

ఇలాంటివారిని ముందే గుర్తించి మేమున్నాం అనే భరోసా కల్పించాలంటున్న నిపుణులు

అమ్మ.. 
నలుగురు సభ్యులున్న ఇంట్లో ముగ్గురికి సరిపోయే ఆహారం మాత్రమే ఉన్నప్పుడు తనకు ఆకలి లేదని చెప్పి పిల్లల కడుపు నింపే గొప్ప మనసున్న మనిషి.

నాన్న..
పిల్లల అవసరాల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి.. తన అవసరాలను సైతం త్యాగం చేసి పిల్లల బాగోగుల కోసమే పరితపించే మంచి నేస్తం.

మరి అలాంటి తల్లిదండ్రులకు ఇప్పుడేమైంది?  
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలకు స్వయంగా మరణశాసనం ఎందుకు లిఖిస్తున్నారు?  

పిల్లల ప్రాణాలను తీయాలనే కఠినమైన నిర్ణయం ఎలాతీసుకుంటున్నారు? 
అమూల్యమైన, కల్మషం లేని కన్నప్రేమ యమపాశంగామారుతోందా?

తల్లిదండ్రులు తమ పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు గత కొంతకాలంగా ఎక్కువయ్యాయి. అప్పులబాధలో, కుటుంబ కలహాలో, మానసిక ఒత్తిళ్లో.. కారణాలు ఏవైనా సరే.. చావు ఒక్కటే పరిష్కారం అనే భావన వల్లే ఇవి పెరిగిపోతున్నాయ్‌. పొత్తిళ్లలోని పసిబిడ్డల దగ్గర నుంచి ఇంటర్‌ చదువుతున్న యుక్తవయసు పిల్లలను సైతం చంపేయడమో.. చనిపోయేలా ప్రేరేపించడమో చేసి, ఆపై వారు కూడా తనువు చాలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడానికి అనేక సామాజిక, ఆర్థిక, మానసిక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

వీటిని మర్డర్‌–సూసైడ్‌ లేదా ఫిలిసైడ్‌–సూసైడ్‌ అని అంటారు. గత ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను విశ్లేషిస్తే ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. డిప్రెషన్‌ వంటి అంశాలు కీలకంగా కనిపించాయి. వ్యాపారాల్లో నష్టాలు రావడం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు లేదా జూదంలో డబ్బులు పోగొట్టుకోవడం, అధిక వడ్డీలకు అప్పులు చేసి తీర్చలేకపోవడం వంటి అంశాల వల్ల కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవ చేయడం, సమాజంలో తలదించుకోవాల్సి రావడం వంటి పరిస్థితులను తట్టుకోలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటారు. 

అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు కూడా ఇందుకు దారితీస్తున్నాయి. గృహ హింస, వివాహేతర సంబంధాలు లేదా భాగస్వామిపై పగ తీర్చుకోవాలనే వికృత కోపం... చివరికి పిల్లల మరణ శాసనంగా మారుతోంది. చాలా కేసుల్లో తీవ్రమైన డిప్రెషన్‌ (కుంగుబాటు) సైతం కారణంగా ఉంటోంది.     – సాక్షి, సెంట్రల్‌ డెస్క్

ఎలా గుర్తించాలి.. ఏం చేయాలి? 
చనిపోవాలి అనే నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోరు. ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలతో విసిగి వేసారి, తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. తాము చనిపోబోతున్నామనే విషయాన్ని సన్నిహితుల దగ్గర పరోక్షంగా వెల్లడిస్తుంటారు. కాస్త నిర్వేదంగా మాట్లాడుతుంటారు. 

మన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తే.. వెంటనే వారితో మాట్లాడాలి. ముందుగా వారి సమస్య ఏమిటో అడిగి తెలుసుకోవాలి. నీకేం కాదు.. మేమంతా ఉన్నాం అనే భరోసా కల్పించాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా బయటపడొచ్చో వివరించాలి. ఎంత మాట్లాడినా వారు అలాగే ఉంటే.. మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకెళ్లాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్‌లైన్ల ద్వారా ఇలాంటి సేవలను ఉచితంగా కూడా అందిస్తున్నాయి.

వారు క్రూరులు కాదు..  
ఇలాంటి సంఘటనలు చూడగానే సహజంగా మనకు కోపం వస్తుంది. కానీ పిల్లల్ని చంపుకొనే తల్లిదండ్రులు క్రూరులు కారు. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులుగానే వారిని పరిగణించాలి.తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయినవారి ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటివారంతా టన్నెల్‌ విజన్‌లో ఉండిపోతారు. అంటే.. సమస్య వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అవకాశాలు ఏవీ కనిపించకుండా, కేవలం చావు మాత్రమే ఏకైక మార్గంగా కనిపించే ఒక విచిత్రమైన మానసిక స్థితి. 

అలాగే చాలా సంఘటనల్లో పిల్లలపై మితిమీరిన ప్రేమ కూడా    ఇందుకు కారణం అవుతోంది. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతుంటే.. వారితో కూర్చుని మాట్లాడాలి. వారు చెప్పింది వినాలి. అలాంటివారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి పలు ఉచిత హెల్ప్‌లైన్లు కూడా ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారం కాకుంటే సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాలి.  – విశేష్, సైకాలజిస్ట్‌  

పోటీ ప్రపంచంలోఏమైపోతారోనని.. 
గతేడాది మార్చిలో కాకినాడలో జరిగిన ఒక విషాదకర సంఘటన అందరినీ నివ్వెరపరిచింది. ఓ ప్రభుత్వ రంగసంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న చంద్ర కిషోర్‌ అనే వ్యక్తి తన ఇద్దరు కొడుకులను (7 ఏళ్లు, 6 ఏళ్లు) చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విపరీతమైన పోటీ ప్రపంచంలో తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం తీవ్ర నిరాశలోకి నెట్టేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడం పలువురిని షాక్‌కు గురిచేసింది.  

పిల్లలను చంపడం ఎందుకు?
పిల్లలను చంపి తాము చనిపోయే తల్లిదండ్రుల్లో ఒక విచిత్రమైన మానసిక రుగ్మత కనిపిస్తుంది. ‘నేను లేకపోతే నా పిల్లలు రోడ్డున పడతారు. సమాజం వారిని అనాథలుగా చూస్తుంది. నాలాగే వాళ్ళు కూడా కష్టాలు పడకూడదు. అందువల్లే నా వెంట నా పిల్లలను కూడా తీసుకెళ్లిపోతాను’అనే భావన ఇందుకు కారణం. అలాగే జీవిత భాగస్వామి మీద కోపం వల్ల కూడా పిల్లలను చంపేసే సంఘటనలు చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల తమ భాగస్వామి జీవితాంతం బాధలో కూరుకుపోతారనే ఆలోచనే ఇందుకు ఉసిగొల్పుతోంది.

చిన్నపిల్లలనైతే.. వారికేం తెలియదు కాబట్టి సులభంగా చంపేస్తున్నారు. మరి ఇంటర్‌ చదివే పిల్లల్ని ఎలా ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారనే సందేహం రావడం సహజం. ఇక్కడ వారు తీసుకున్న నిర్ణయం ఒక్కరోజో, ఒక్క రాత్రో జరగదు. తల్లి లేక తండ్రి.. వారిని కొన్ని నెలలుగా అందుకు మానసికంగా సిద్ధం చేస్తారు. ఏం చేసినా మనం కలిసే చేయాలనే భావనను నెమ్మదిగా వారి మనసులోకి చొప్పిస్తారు. దీంతో ఆ పిల్లలు వారి మాట విని ప్రాణం తీసుకుంటున్నారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే..
టెలి–మానస్‌ (భారత ప్రభుత్వం): 14416 లేదా 1800 891 4416(24 గంటలు అందుబాటులో ఉంటుంది) 
కిరణ్‌ హెల్ప్‌లైన్‌: 1800–599–0019. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ టెలి–కౌన్సెలింగ్‌లో తెలుగు సహా 13 భాషలలో సేవలు ఉచితంగా లభిస్తాయి.
జీవన హెల్ప్‌లైన్‌ టోల్‌–ఫ్రీ నెంబర్‌: 1800–425–5438 రోష్ని హెల్ప్‌లైన్‌ (హైదరాబాద్‌): 040–66202000 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement