
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో "న్యూడ్ గ్యాంగ్" పేరుతో మహిళలపై దాడులు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా దౌరాలా ప్రాంతంలో నాలుగు ఘటనలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాల్లోకి కొందరు పురుషులు నగ్నంగా వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను పొలాల్లోకి లాక్కెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల మీరట్‌లోని భారాలా గ్రామంలో ఓ మహిళ ఒంటరిగా ఆఫీస్‌కు వెళ్తున్న సమయంలో ఓ ప్రాంతంలో న్యూడ్ గ్యాంగ్ ఆమెను పొలంలోకి లాగడానికి యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత మహిళ కేకలు వేయడంతో.. వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. వారి కోసం గాలించినా ఫలితం లేదన్నారు. అయితే తనను లాక్కెళ్లడానికి యత్నించిన వ్యక్తులు ఎటువంటి దుస్తులు ధరించలేదంటూ బాధిత మహిళ పేర్కొంది. తమ గ్రామంలోని ముగ్గురు మహిళలకు ఇలాంటి ఘటనే ఎదురు కాగా, భయంతో బయటపెట్టలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను ఆశ్రయించామని గ్రామస్తులు తెలిపారు.

కొంతమంది ఈ ఘటనలను వదంతులుగా కొట్టిపారేస్తున్నారు. పలు గ్రామాల ప్రజలు కూడా తాము న్యూడ్ గ్యాంగ్‌ను చూశామంటూ చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి అనుమానితులను గుర్తించలేదని పోలీసులు వెల్లడించారు. న్యూడ్ గ్యాంగ్ కోసం డ్రోన్ల సహాయంతో ఈ ప్రాంతాలను గాలించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.