
భువనేశ్వర్: లైంగిక వేధింపుల ఉదంతానికి మరో విద్యార్థిని అశువులుబాసింది. ఒడిశాలోని ఒక కళాశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడంతో కలత చెందిన ఒక విద్యార్థిని ఒంటికి నిప్పటించుకుంది. మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది.
ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు జూలై 1న కళాశాల ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె కళాశాల అధికారులకు రాసిన లేఖలో ఆ ప్రొఫెసర్ నెలల తరబడి తనపై సాగించిన వేధింపులు, బెదిరింపులను వివరించింది. అయినా ప్రొఫెసర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. ఈ నేపధ్యంలో తీవ్ర నిరాశలో ఉన్న బాధితురాలు జూలై 12న బాలసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల ప్రాంగణంలో నిప్పంటించుకుంది. 90 శాతం మేరకు కాలిపోయిన బాధితురాలిని వెంటనే ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ଫକୀର ମୋହନ ସ୍ୱୟଂଶାସିତ ମହାବିଦ୍ୟାଳୟର ପୀଡ଼ିତା ଛାତ୍ରୀଙ୍କ ଦେହାନ୍ତ ଖବର ଶୁଣି ମୁଁ ଅତ୍ୟନ୍ତ ମର୍ମାହତ। ସରକାରଙ୍କ ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ନିର୍ବାହ ତଥା ବିଶେଷଜ୍ଞ ଡାକ୍ତରୀ ଦଳଙ୍କ ଅକ୍ଲାନ୍ତ ପରିଶ୍ରମ ସତ୍ତ୍ୱେ ପୀଡ଼ିତାଙ୍କ ଜୀବନ ରକ୍ଷା ହୋଇପାରିଲା ନାହିଁ । ତାଙ୍କର ଅମର ଆତ୍ମାର ସଦଗତି କାମନା କରିବା ସହ ପରିବାରବର୍ଗଙ୍କୁ ଏହି ଅପୂରଣୀୟ…
— Mohan Charan Majhi (@MohanMOdisha) July 14, 2025
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.‘ఎఫ్‌ఎం అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని మృతి వార్త విని చాలా బాధపడ్డాను. నిపుణులైన వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, బాధితురాలి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ జగన్నాథుడిని వేడుకుంటున్నాను. ఈ కేసులో దోషులందరూ చట్ట ప్రకారం కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని బాధిత విద్యార్థిని కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఇందుకోసం వ్యక్తిగతంగా అధికారులకు తగిన సూచనలు జారీ చేశాను’ అని ఆయన తన ఆన్‌లైన్ పోస్ట్‌లో తెలిపారు.