Fishermen: పొట్టకూటి కోసం మత్స్యకారుల అవస్థలు

Odisha: Fishermens No Work Amid Lockdown Suffering For Living - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిన చేపల వేట

పొట్టకూటి కోసం అవస్థలు పడుతున్న మత్స్యకారులు

ఆర్థికసాయం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి

బరంపురం: రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతోమంది జీవితాలను కరోనా మహమ్మారి ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్, షట్‌డౌన్‌లతో రోజువారీ కూలీలు, కొన్ని సంప్రదాయ వృత్తుల వారు పొట్టకూటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా అనాది కాలంగా చేపల వేటని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అయితే మరీ దారుణం. కరోనా నిబంధనలు అతిక్రమిస్తూ వేట కొనసాగించలేని వారంతా ఇప్పుడు ఇంటికే పరిమితమై, ఆకలితో పస్తులుంటున్నారు. కొంతమంది తీరం వైపు చూస్తూ తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తావమని సముద్ర దేవునికి దండం పెట్టుకుంటున్నారు.

దాదాపు రెండు వారాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, వేటకు వెళ్తే కానీ ఆ రోజు కాలం గడవదని, ఈ పరిస్థితుల్లో తామెలా బతకాలని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి, తమకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 475 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న గంజాం జిల్లాలో సూన్‌పూర్‌ నుంచి చందిపూర్‌ వరకు దాదాపు 108 మత్స్యకార గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాల్లోని 15 వేల కుటుంబాలు చేపల వేటని ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఆదుకున్న విధంగానే ఇప్పుడు కూడా ఆదుకోవాలని పలు మత్స్యకార సంఘాల ప్రతినిధులు జి.ఎర్రయ్య, టి.సింహాద్రి, జి.పాపారావు తదితరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top