
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.
ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియా బాద్‌లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.
బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్‌ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్‌స్ట్రాగామ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్‌గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు.

కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.
కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు.