షాకింగ్‌ డెలివరీ! ఆన్‌లైన్‌లో బ్రెడ్‌ ఆర్డర్‌ చేస్తే.. ఎలుక ప్రత్యక్షం.. షాక్‌ తిన్న కస్టమర్‌!

Man Finds Rat Inside Packet Of bread Delivered by Blinkit - Sakshi

ఒకప్పుడు ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కిరాణం షాప్‌లు, సూపర్‌ మార్కెట్‌ల వద్ద లైన్‌లో నిలబడి తీసుకొచ్చుకొనేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా కూరగాయలు, పప్పులు, ఉప్పులు, వండిన ఆహారం.. పర్నీచర్‌ ఇలా ఒక్కటేంటి అన్నీ ఆన్‌లైన్‌లోనే లభిస్తున్నాయి. చేతిలో ఒక్క ఫోన్‌ ఉంటే చాలు.. కోరుకున్న వస్తువులు నిమిషాల్లో మన ముందు వాలిపోతున్నాయి. ఫోన్‌లోని యాప్‌ల ద్వారా మనకు ఏం కావాలో క్లిక్‌ చేస్తే బయట ధరలకే వస్తువు డెలివరీ అయిపోతుంది. దీంతో ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతోంది.

అయితే ఆన్‌లైన్‌ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చాక ప్రయోజనాలతోపాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఆర్డర్లు మారిపోవడం, నాణ్యత లేని వస్తువులు రావడం లేదా పాడైపోవడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్డర్‌ చేసిన వాటిల్లో క్రిమి కీటకాలు వస్తుండటం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

నితిన్‌ అరోరా అనే వ్య‌క్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డ‌ర్ ఇవ్వ‌గా అందులో ఎలుక క‌నిపించ‌డంతో ఖంగుతిన్నాడు. ట్విటర్‌ వేదికగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని షేర్‌ చేశారు. ‘లెట్స్‌ బ్లింకిట్‌లో అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను.  ఫిబ్రవరి 1వ  తేదీన ఆర్డర్‌ చేసిన బ్రెడ్‌ ప్యాకెట్‌లో బతికున్న ఎలుక వచ్చింది. ఇది మనందరిని హెచ్చరించే అంశం. ఆర్డర్‌ చేసే ముందు గమనించుకోండి. వస్తువు డెలివరీ ఆలస్యమైనా పర్లేదు, కానీ, 10 నిముషాల్లో పార్సిల్‌ వస్తుందని ఇలాంటివి అంటగట్టడం దారుణం’.. అని వాపోయాడు.

అరోరా పోస్టులో ఎలుకతో కూడిన బ్రెడ్ ప్యాకెట్‌ను మాత్రమే చూపించకుండా బ్లింకిట్ కస్టమర్ సర్వీస్ స్క్రీన్‌షాట్‌ను కూడా పంచుకున్నారు.  ఈ ఫోస్టు వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదీ మరీ ఘోరమని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహిరస్తారంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఈ ఘటనపై కంపెనీ కామెంట్స్ విభాగంలో స్పందించింది. హాయ్ నితిన్! మీకు ఇలాంటి అసౌక‌ర్యం క‌లగాల‌ని తాము కోరుకోలేద‌ని.. మీ రిజిస్ట‌ర్డ్ కాంటాక్ట్ నెంబ‌ర్ లేదా ఆర్డ‌ర్ ఐడీ పంపితే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని బ‌దులిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top