70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!

Maharashtra: Solapur Farmer Sell 512 Kg Onions, Finally Get Cheque For Rs 2 - Sakshi

ముంబై: మన దేశంలో రైతుల అప్పులు, వ్యవసాయం సాగించేందుకు వారు పడే తిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా ఎరువులు, పురుగులు మందు, కూలి ఖర్చులు, కావాల్సిన ఇతర సామాగ్రి ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైతుకు గిట్టు ధర తప్ప మిగతావన్నీ పైపైకి పోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ జీవితాల్లో మార్పు రావడం లేదని చివరికి మిగిలేది అప్పులు మాత్రమే అని రైతులు వాపోతున్నారు.

మరీ రూ.2 ఇచ్చాడు
తాజాగా ఓ రైతు ఎన్నో కష్టాలు, ఖర్చులు పెట్టి పండించిన పంటకు అన్నీ పోనూ చివరికి రూ. 2 మిగిలింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ దేశంలో ప్రస్తుతం రైతుల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. ఈ చేదు అనుభవం మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఓ రైతుకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. షోలాపూర్ జిల్లా బార్షి జిల్లాకు చెందిన రాజేంద్ర చవాన్ అనే రైతు ఫిబ్రవరి 17న 10 బస్తాల ఉల్లిగడ్డలను వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి తీసుకొచ్చాడు. ఉల్లి ధరలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో రైతులకు క్వింటాల్‌కు రూ.100 ధర లభించింది.

రైతు తెచ్చిన ఉల్లిపాయలను అమ్మగా వచ్చిన మొత్తం బిల్లు 512 రూపాయలు. అందులో  రవాణా, తూకం, వాహన ఛార్జీల కింద రూ. 509.51 పోయాయి. చివరికి రూ.2.49 మిగిలింది. దీంతో వ్యాపారి రౌండాఫ్‌ ఫిగర్‌ చేసి 2 రూపాయలు చెక్కును రైతుకు ఇచ్చాడు. చెక్కుపై తేదీ మార్చి 8, 2023 అని కూడా పేర్కొనడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నో రోజులు శ్రమించి, ఎంతో కష్టపడి, పెట్టుబడి పెట్టి పంట పండిస్తే తనకు మిగిలేది రెండు రూపాయలా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు ఇచ్చిన రశీదు, చెక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి  పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top