పట్నా: ఛట్ ఉత్సవ సందడి ముగియడంతో బీహార్‌లోని అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి. మహాకూటమి (మహాఘట్ బంధన్), నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతలో కాంగ్రెస్ నేత కృష్ణ అల్లవారు మహాకూటమి కీలక హామీలను వెల్లడించారు.
మహాకూటమి బీహార్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయకముండే కాంగ్రెస్ నేత వెల్లడించిన కీలక హామీలివే..
మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం రూ. 2,500
రూ. 25 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం
భూమి లేని కుటుంబాలకు భూమి కేటాయింపు
రాజధాని పట్నాలో నేడు(మంగళవారం) మహాకూటమి తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. దీనిలో ఉపాధి, ద్రవ్యోల్బణం, విద్య, రైతుల సంక్షేమం తదితర అంశాలు ఉండనున్నాయని సమాచారం. మరోవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)తమ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
27 మంది తిరుగుబాటు నేతల బహిష్కరణ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్‌జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు.


