Lok sabha elections 2024: వారే వీరయ్యారు! | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: వారే వీరయ్యారు!

Published Sun, Apr 14 2024 5:13 AM

Lok sabha elections 2024: Opponents turned allies in Maharashtra elections - Sakshi

మిత్రులుగా మారిన ప్రత్యర్థులు

ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆసక్తికరంగా రాజకీయం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిరూపించాయి. గతంలో ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని, ఎత్తుకు పై ఎత్తులు వేసిన నేతలు ఇప్పుడు హఠాత్తుగా మిత్రులైపోయారు. కొత్త మిత్రుల గెలుపు కోసం లోక్‌సభ సమరాంగణంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో స్నేహితులుగా ఉన్నవారు కాస్తా ఇప్పుడు శత్రువులుగా మారి రాజకీయ చదరంగంలో కొత్త గెలుపు ఎత్తులు వేస్తున్నారు.  

అజిత్‌ వర్సెస్‌ కోల్హే
2019 లోక్‌సభ ఎన్నికల్లో శిరూర్‌ శివసేన సిట్టింగ్‌ ఎంపీ శివాజీరావ్‌ అథాల్‌రావ్‌ పాటిల్‌ను ఎలాగైనా ఓడించాలని అజిత్‌ కంకణం కట్టుకున్నారు. టీవీ, సినీ రంగ ప్రముఖుడు అమోల్‌ రాంసింగ్‌ కోల్హేను శివసేన నుంచి ఎన్సీపీలో చేర్చుకుని మరీ శివాజీరావ్‌పై పోటీకి దింపారు. విస్తృత ప్రచారం చేసి కోల్హేను గెలిపించారు. కానీ ఎన్సీపీ చీలిక ఎపిసోడ్‌లో కోల్హే అజిత్‌ను కాదని శరద్‌ పవార్‌కు మద్దతుగా నిలవడంతో వారిద్దరికీ చెడింది. బీజేపీ, శివసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా షిరూర్‌లో సొంత అభ్యరి్థని నిలబెట్టే అవకాశం అజిత్‌కు లభించింది. దాంతో కోల్హేను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకోసం గత ఎన్నికల్లో తానోడించిన అథాల్‌రావ్‌ పాటిల్‌నే కోల్హేపై పోటీకి నిలబెట్టారు! ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు.

వదినా మరదళ్ల వార్‌
బారామతిలో చాన్నాళ్లుగా శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే పోటీచేస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు అజిత్‌ తన భార్య సునేత్రను బరిలో దింపారు. దీంతో వదినా మరదళ్లు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. పైగా అజిత్‌ తమ్ముడు శ్రీనివాస్, ఆయన కుటుంబీకులు సూలేకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు! ఇది అజిత్‌ కుటుంబంలో మరో చీలికకు కారణమవుతోంది.

నాడు వేర్వేరు సభలు.. ఇప్పుడు ఒకే స్థానం కోసం పోరు
రాహుల్‌ రమేశ్‌ షేవలే, అనిల్‌ దేశాయ్‌ అవిభాజ్య శివసేనలో సన్నిహిత మిత్రులుగా మెలిగారు. రాహుల్‌ రెండుసార్లు సౌత్‌ సెంట్రల్‌ ముంబై ఎంపీగా గెలవగా అనిల్‌ రాజ్య సభ సభ్యునిగా ఉండేవారు. శివసేన చీలాక రాహుల్‌ షిండే వర్గంలో చేరగా అనిల్‌ ఉద్ధవ్‌ వర్గంలోనే కొనసాగారు. ఈసారి ఇద్దరూ సౌత్‌ సెంట్రల్‌ ముంబై నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగారు.

అనిల్‌కు ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌ వర్షా గైక్వాడ్‌ మద్దతు పలికారు. వర్ష తండ్రి ఏక్‌నాథ్‌ను 2014 లోక్‌సభ ఎన్నికల్లో షేవలే ఓడించడమే అందుకు కారణం. ‘‘దేవేంద్ర ఫడ్నవిస్‌ చాణిక్యంతో చీలికలు తేనంతవరకూ శివసేన, ఎస్సీపీ కుటుంబ పారీ్టలుగా నిక్షేపంగా ఉండేవి. వాటిలో చీలి కతో లోక్‌సభ ఎన్నికలు మహాభారత యుద్ధా న్నే తలపిస్తున్నాయి. కుటుంబసభ్యులే పరస్పరం పోటీపడుతూ ప్రత్యర్థులకు సాయం చేస్తున్నారు’’ అని సీనియర్‌ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులు ప్రకాశ్‌ అకోల్కర్‌ అభిప్రాయపడ్డారు.   

చిఖ్లీకర్‌ కోసం చవాన్‌ ప్రచారం
గురువారం నాందేడ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ర్యాలీలో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్, బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌ పాటిల్‌ చిఖ్లీకర్‌ ఒకే వేదికను పంచుకున్నారు. గత ఫిబ్రవరి దాకా వారిద్దరూ బద్ధ శత్రువులు. చిక్లీకర్‌ లోహా నుంచి శివసేన ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌ చవాన్‌ను మట్టికరిపించారు. చవాన్‌ కూడా తాజాగా బీజేపీలో చేరడంతో వారి మధ్య వైరం మటుమాయమైంది. ఫిబ్రవరిలో బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన చవాన్‌ ఇప్పుడు చిక్లీకర్‌కు స్నేహహస్తం అందించారు. చిక్లీకర్‌ గెలుపు కోసం మరఠ్వాడాలో తెగ ప్రచారం చేస్తున్నారు.

బరనే కోసం అజిత్‌...
గత లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ నుంచి ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థపై శివసేన నేత శ్రీరంగ్‌ బరనే గెలిచారు. నాటినుంచి అజిత్, బరనే మధ్య వైరం పెరిగింది. కానీ తాజా పరిణామాలతో వారి మధ్య స్నేహం చిగురించింది. శివసేనను ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీని అజిత్‌ చీల్చి బీజేపీతో జట్టుకట్టడం తెలిసిందే. బరనే కూడా షిండే వెంట నడిచారు. దాంతో అజిత్‌తో ఆయన శత్రుత్వం సమసిపోయింది. ఈ నేపథ్యంలో అజిత్‌ ఈసారి బరనే కోసం ప్రచారం చేస్తున్నారు.

నాడు ఓడించి నేడు ప్రచారం చేస్తూ..
బీజేపీ అధిష్టానం ఈసారి బీడ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ ప్రీతం ముండే స్థానంలో ఆమె సోదరి, మాజీ మంత్రి పంకజా ముండేను ఎంపిక చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజ తన బంధువైన ఎన్సీపీ నేత ధనంజయ్‌ ముండే చేతిలో ఓడారు. ఇప్పుడాయన అజిత్‌ ఎన్సీపీలో ఉన్నారు. బీజేపీతో ఎన్సీపీ చెలిమి నేపథ్యంలో పంకజ తరపున ధనంజయ్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

 –సాక్షి, న్యూఢిల్లీ  

Advertisement
 
Advertisement