Lok Sabha Election 2024: నువ్వా నేనా?! | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: నువ్వా నేనా?!

Published Fri, May 10 2024 4:37 AM

Lok Sabha Election 2024: tough fight between nda and india alliance in bihar ls polls

బిహార్లో నాలుగో దశలో ఆసక్తికర పోరు 

5 లోక్‌సభ స్థానాలకు 13న పోలింగ్‌ 

ఎన్డీఏ, ఇండియా కూటముల హోరాహోరీ 

యూపీ, పశ్చిమబెంగాల్‌ మాదిరే బిహార్‌లోనూ లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లోనూ జరుగుతున్నాయి. బీజేపీ, జేడీ(యూ), లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌)తో కూడిన ఎన్‌డీఏ కూటమి; కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కూడిన విపక్ష ఇండియా కూటమి హోరాహోరీ తలపడుతున్నాయి. 40 స్థానాలకు తొలి మూడు విడతల్లో 14 చోట్ల పోలింగ్‌ ముగిసింది. 

ఈ నెల 13న నాలుగో దశలో దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్‌ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. వీటిలో 2019 ఎన్నికల్లో బీజేపీ మూడు, ఎల్‌జేపీ, జేడీ(యూ) ఒక్కో చోట గెలిచాయి. ఈసారి ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ అనారోగ్య సమస్యలను పక్కన పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ విడతలో ఇద్దరు కేంద్ర మంత్రుల భవిష్యత్‌ను ఓటర్లు తేల్చనున్నారు... 

బెగుసరాయ్‌ 
బిహార్‌లోని హాట్‌ సీట్లలో ఇదీ ఒకటి. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ మంత్రి, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ మళ్లీ బరిలో దిగారు. ఆయనపై ఇండియా కూటమి నుంచి సీపీఐ సీనియర్‌ నాయకుడు అవధేశ్‌ కుమార్‌ రాయ్‌ పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ 1967లో గెలిచారు. 57 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలో దిగుతుండటం విశేషం! 

ఈ నియోజకవర్గంలో భూమిహార్‌ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. గిరిరాజ్‌ కూడా ఆ కులానికి చెందినవారే. 2019లో సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ను ఆయన 4.2 లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. విపక్షాలన్నీ సంఘటితం కావడం ఈసారి ఆయనకు కాస్త ప్రతికూలమే. 2004 దాకా ఇక్కడ కాంగ్రెస్‌దే హవా! 2004, 2009ల్లో జేడీ(యూ) గెలిచింది. 

ఉజియార్‌పూర్‌ 
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత నిత్యానందరాయ్‌ ఇక్కడి సిట్టింగ్‌ ఎంపీ. 2014లోనూ ఇక్కడ ఆయనే నెగ్గారు. 2019లో రాయ్‌ చేతిలో ఓడిన రాష్రీ్టయ లోక్‌ సమతా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వహ ఎన్డీఏలో చేరడంతో హ్యాట్రిక్‌ విజయంపై బీజేపీ భరోసాతో ఉంది. 

2014లో రాయ్‌ చేతిలో ఓడిన అలోక్‌ కుమార్‌ మెహతా మరోసారి ఆర్జేడీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ, ఇండియా కూటముల చేతుల్లో చెరి సగం ఉన్నాయి. ఇక్కడ యాదవ, కుశ్వాహ సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువ. ముస్లింలు, బ్రాహ్మణుల ఓట్లు కూడా ఎక్కువే. 

ముంగేర్‌ 
ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట. కొన్నేళ్లుగా జేడీ(యూ)కే జై కొడుతోంది. జేడీ(యూ) మాజీ చీఫ్, సిట్టింగ్‌ ఎంపీ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (లలన్‌ సింగ్‌) ఈసారీ బరిలో ఉన్నారు. ఆర్జేడీ నేత గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మెహతో జైలు పాలవడంతో పార్టీ తరఫున ఆయన భార్య అనితా దేవి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు చెరో సగం గెలుచుకున్నాయి. 

ఇక్కడ ఏ సామాజిక వర్గానిదీ పూర్తి ఆధిపత్యం కాకపోవడం విశేషం! మొకామ సిట్టింగ్‌ ఆర్జేడీ ఎమ్మెల్యే అయిన గ్యాంగ్‌స్టర్‌ అనంత్‌సింగ్‌ అనూహ్యంగా లలన్‌సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దాంతో పరిస్థితులు ఆయనకు మరింత అనుకూలంగా మారాయి. ఆయుధాల చట్టం కేసులో పదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న అనంత్‌ ఈ నెల 5న పెరోల్‌పై విడుదలై మరీ లలన్‌సింగ్‌కు ప్రచారం చేస్తున్నారు. భారీ వాహన కాన్వాయ్‌తో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు.  

దర్భంగా 
దీన్ని మిథిల ప్రాంత రాజధానిగా పరిగణిస్తుంటారు. మైథిలీ బ్రాహ్మణుల ఆధిపత్యమున్న ఈ లోక్‌సభ స్థానంలో 2009 నుంచీ బీజేపీయే గెలుస్తూ వస్తోంది. అగ్రవర్ణాలకు చెందిన సిట్టింగ్‌ ఎంపీ గోపాల్‌ జీ ఠాకూర్‌ మళ్లీ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. యాదవులు, అగ్ర వర్ణాలతో పాటు ఓబీసీ ఓట్లపైనా బీజేపీ ఆశలు పెట్టుకుంది. మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ ఇక్కడ 1999, 2009, 2014ల్లో బీజేపీ తరఫున గెలిచారు.

 2021లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదు బీజేపీ, జేడీ(యూ) చేతుల్లోనే ఉన్నాయి. ఈ విడత ఇక్కడి ఓటర్ల నాడి ఎవరికీ అందడం లేదు! ఇక్కడ ముస్లింలు, యాదవుల ఓట్లు ఎక్కువ. ఆర్జేడీ నుంచి లలిత్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ ముస్లింకు టికెటివ్వకపోవడం, పైగా ముస్లిం అభ్యర్థులను ఓడించిన చరిత్ర ఉండటంతో ఈసారి లలిత్‌కు వారి మద్దతు దక్కకపోవచ్చని భావిస్తున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement