
2022తో పోలిస్తే తగ్గిన జననాలు
జననాల్లో అత్యధికం ఆసుపత్రుల్లోనే
లింగ నిష్పత్తి తెలంగాణలో తక్కువే
జనన, మరణ గణాంకాలు వెల్లడించిన కేంద్రం
దేశవ్యాప్తంగా 2023లో 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 2.32 లక్షలు తక్కువ. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదయ్యాయి. మొత్తం జననాల్లో దాదాపు 75 శాతం ఆసుపత్రుల్లోనే జరగడం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జన గణన కమిషనర్ కార్యాలయం 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా’ పేరిట విడుదల చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కోవిడ్–19 డ్యాష్‌బోర్డ్‌లో 2025 మే 5 నాటికి మహమ్మారి వల్ల సంభవించిన మరణాల సంఖ్య 5,33,665గా ఉంది. 2022, 2023లో మరణాలలో పెద్దగా పెరుగుదల లేదని నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే 2021లో 21 లక్షలకు పైగా అధిక మరణాలు సంభవించాయి. 2020లో 81.2 లక్షలు, 2021లో 1.02 కోట్ల మంది కన్నుమూశారు.
కొన్ని రాష్ట్రాలే..: నిర్ణీత కాలపరిమితి అయిన 21 రోజుల్లోపు 90% కంటే ఎక్కువ జననాల నమోదును 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే సాధించాయి. వీటిలో గుజరాత్, తమిళనాడు, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, గోవా, పంజాబ్ వంటివి ఉన్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 80–90% జననాల నమోదు చేశాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో 50–80% జననాలు మాత్రమే నిర్ణీత కాలపరిమితి లోపు నమోదయ్యాయి.
మగపిల్లలే ఎక్కువ
2023 నమోదిత జనన గణాంకాలు
జననాల్లో మగపిల్లలు 52.4%, ఆడపిల్లలు 47.6%
పట్టణాల్లో 58.3%, గ్రామీణ ప్రాంతాల్లో 41.7% మంది పుట్టారు.
21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జననాల నమోదు ప్రక్రియను 100% పూర్తి చేశాయి.
మరణాల్లో పురుషులే అధికం
మరణాల్లో 60.6% పురుషులు, 39.4% స్త్రీలు ఉన్నారు.
మరణాల్లో గ్రామీణులు 57.7%, పట్టణవాసులు 42.3% ఉన్నారు.
ఆసుపత్రుల్లో మృతి చెందినవారు (సిక్కిం మినహా) 24%
శిశువుల మరణాల్లో పట్టణాల వాటా 85.7%, గ్రామీణ ప్రాంతాల వాటా 14.3%.

విదేశాల్లో జననాలు, మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఉంటున్న భారతీయులకు 2023లో మొత్తం 62,182 మంది జన్మించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, యూకే, ఖతార్‌లలోనే పుట్టడం విశేషం. విదేశాల్లోని భారతీయుల్లో 10,531 మంది మరణించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్‌లలోనే సంభవించాయి.
అత్యధిక శిశు మరణాలు..: 2023లో అత్యధిక శిశు మరణాలు సంభవించిన రాష్ట్రాలు.. మహారాష్ట్ర (17,436), గుజరాత్ (13,676), హరియాణా (11,622). ఏపీలో 6,852, తెలంగాణలో 3,956 సంభవించాయి.