
చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ పట్టు
25 వరకు ఇచ్చేందుకు బీజేపీ–ఆర్‌జేడీ సిద్దం
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పక్షం, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్ పాశ్వాన్)తో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. బిహార్ భవిష్యత్ ముఖచిత్రంలో తన మార్కును చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న చిరాగ్ తన పారీ్టకి ఎక్కువ సీట్లు సాధించుకునేందుకు బీజేపీ, ఆర్‌జేడీలతో బేరసారాలు సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా 40 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో సీట్ల పంపిణీ పెండింగ్‌లో పడిందని సమాచారం.
పాశ్వాన్ అడుగులు పెద్ద పదవి వైపే...
2020 బిహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ 134 స్థానాల్లో పోటీ చేసినా ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎల్‌జేపీ ఎన్డీయే కూటమి పొత్తుతో 6 శాతం ఓట్లతో 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. హాజీపూర్ స్థానం నుంచి చిరాగ్ ఆర్‌జేడీ అభ్యరి్థపై ఏకంగా 1.70 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. బిహార్ ఎన్నికల్లో సైతం బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమితో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. బీజేపీ, జేడీయూలకు చెరో 100 సీట్ల చొప్పున 200 సీట్లు పోగా మిగిలిన 20–25 స్థానాలను ఎల్‌జేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన కనీసంగా 40 సీట్లు అడుగుతున్నారనే వాదనలు వినిపించాయి.
ఇదే సమయంలో చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించవచ్చనే వార్తలూ వస్తు న్నాయి. ఈ సమయంలోనే ఆయన ‘బిహార్ ఫస్ట్..బిహారీ ఫస్ట్’నినాదాన్ని ఎత్తుకొని తనకు బిహార్ రాష్ట్రంలోనే రాజకీయాలు ఎక్కువ మక్కువని చెప్పకనే చెబుతున్నారు.
ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేరును చెప్పకుండానే, తనను రాష్ట్రానికి రాకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవ్వరికీ భయపడబోనని పేర్కొన్నారు. పటా్నలో ఇటీవల జరిగిన వ్యాపారవేత్త గోపాల ఖేమ్కా హత్యను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సుపరిపాలను పేరుగాంచిన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని నితీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పాశ్వాన్ ప్రకటనల వెనక ప్రధానంగా రాష్ట్రంలో బలహీన వర్గాల్లో తమ పార్టీకి ఉన్న పట్టు కోల్పోరాదని, ఢిల్లీ పేరు చెప్పి..క్షేత్రస్థాయిలో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకోరాదనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పట్టున్న తమ వర్గాలను జేడీయూ పూర్తిగా తనవైపు తిప్పుకుంటుండటం, మరికొందరు కీలక నేతలు ఎన్డీయే కూటమిలో ఇమడలేక ఆర్‌జేడీ వైపు మొగ్గు చూపుతుండటాన్ని ఇష్టపడని పాశ్వాన్ రాష్ట్రంలో పట్టును నిలుపుకునేందుకే 40 సీట్లపై పట్టు వదలడం లేదని అంటున్నారు. అయితే, సీట్ల పంపకాలపై మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.