చిరకాల రాజకీయ ప్రత్యర్థి.. అయినా బడే భాయ్‌నే! ఆస్పత్రి బెడ్‌ నుంచి లాలూ భావోద్వేగం

Lalu Prasad Yadav Reacts On Sharad Yadav Demise - Sakshi

కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ హఠాన్మరణం.. బీహార్‌ రాజకీయాల్లో విషాద ఛాయలు నింపింది. ఐదు దశాబ్దాలపాటు.. జాతీయ రాజకీయాల్లో రాణించి తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే చిరకాల రాజకీయ ప్రత్యర్థిగా పేరున్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. శరద్‌ యాదవ్‌ మరణంపై ఎమోషనల్‌ అయ్యారు. 

తమ మధ్య రాజకీయపరంగా రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రం చెడిపోలేదని లాలూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్య కారణాల రిత్యా సింగపూర్‌లో ఉన్న లాలూ.. ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. బడే భాయ్‌(పెద్దన్న)గా శరద్‌ యాదవ్‌ను సంబోధిస్తూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని లాలూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

‘‘అతను(శరద్‌ యాదవ్‌), ములాయం సింగ్‌, నితీశ్‌ కుమార్‌, నేను.. మీమంతా రామ్‌ మనోహర్‌ లోహిలా, కార్పూరి థాకూర్‌ నుంచి సోషలిజం రాజకీయాలు నేర్చుకున్నాం. ఎన్నోసార్లు మేం రాజకీయాల పరంగా పోటీ పడ్డాం. కానీ, మా మధ్య బంధం మాత్రం ఎప్పుడూ చెడిపోలేదు’’ అని లాలూ గుర్తు చేసుకున్నారు. 

శరద్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది.. సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌ నుంచి మొదలుపెట్టినప్పటికీ.. ఆయన మాధేపురనే బేస్‌గా చేసుకుని ముందుకు వెళ్లారు. ఇందులో లాలూతోనే పోటాపోటీ నడిచింది. నాలుగుసార్లు గెలిస్తే.. నాలుగుసార్లు ఓడిపోయారు. 1991, 1996 నుంచి నెగ్గి, 1998లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. 1999లో లాలూను ఓడించారు. మళ్లీ 2004లో లాలూ చేతిలో ఓడారు. 2009లో మళ్లీ నెగ్గారు. 2014, 2019లో మోదీ మేనియాలో శరద్‌ యాదవ్‌ ఓటమి పాలయ్యారు.  

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్‌ యాదవ్‌ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్‌ యాదవ్‌ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీ-యూ) జాతీయ అధ్యక్షుడయ్యారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.  2017లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో  విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు.

2018లో లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌(ఎల్‌జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. కానీ, ఆ పార్టీకి అధికారిక గుర్తింపు లేకుండా పోయింది. తొలుత బహుజన్‌ ముక్తి పార్టీ తో విలీనం కావాలని భావించినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇది తొలి అడుగని శరద్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్‌ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్‌ యాదవ్‌ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

‘ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్‌ లేదు. మేము తొలుత సీపీఆర్‌ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు’ అని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top