తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, ఎన్నికల మేనేజ్‌మెంట్ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున, సీనియర్ నేత సెంగోట్టయన్ సహా మొత్తం 9 మంది మంత్రులుగా సోమవారం వారి వారి ఛాంబర్‌లలో బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదాలలో మంగళవారం నుంచి సమీక్షలు, సమావేశాలపై దృష్టి పెట్టారు. కాగా త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందిని తెలిసింది. ఇందులో మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకూ అమాత్యయోగం దక్కనుందని సమాచారం.
సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్‌లో మరి కొంత మంది మంత్రులు బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. తాజాగా తొమ్మిది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోగా, మరో 22 శాఖలకు మంత్రుల నియామకం జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు రెండు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టు, మిగిలిన పదవులలో టీవీకే ఎమ్మెల్యేలకు అవకాశంకల్పించేందుకు సీఎం విజయ్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొత్త మంత్రుల జాబితా బుధవారం వెలువడే అవకాశం ఉందని, వారు గురువారం ప్రమాణస్వీకారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తాజా 9 మంది మంత్రుల నేపథ్యం ఇదీ..
ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్) – గ్రామీణాభివృద్ధి – జలవనరుల శాఖ : 61 ఏళ్ల ఆనంద్ పుదుచ్చేరికి చెందినవారు. 2006లో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బుస్సీ ఆనంద్‌గా గుర్తింపు పొందారు. తొలుత విజయ్ అభిమాన సంఘాల్లో చేరి, ఆ తర్వాత విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, ఆపై విజయ్‌కు అత్యంత ఆప్తుడిగా మారారు. టీవీకే పార్టీలో అత్యంత కీలకమైన (రెండవ పెద్ద) నేతగా ఉంటూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చెన్నైలోని టి.నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీని ద్వారా పుదుచ్చేరి, తమిళనాడు.. రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
ఆధవ్ అర్జున – పబ్లిక్ వర్క్స్ – క్రీడా శాఖ: తిరుచ్చికి చెందిన 43 ఏళ్ల ఆధవ్ అర్జున రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్. లాటరీ మారి్టన్ అల్లుడైన ఈయన, గతంలో ప్రశాంత్ కిశోర్‌తో కలిసి డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత ’వాయిస్ ఆఫ్ కామన్స్’ అనే సొంత వ్యూహ సంస్థను స్థాపించారు. వీసీకే పారీ్టలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేసి, అనంతరం టీవీకేలో చేరి విజయ్ నమ్మకస్థుడిగా మారారు. చెన్నైలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కే.ఏ. సెంగోట్టయన్ (ఆర్థికశాఖ): మంత్రివర్గంలోనే అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత సెంకోట్టయన్ (77). ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన ఈయన, 1972లో ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపించినప్పటి నుండి ఆ పారీ్టలో ఉన్నారు. గోబిచెట్టిపాళయం నియోజకవర్గం నుండి ఏకంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గాల్లో రవాణా, పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచిచన గోబి చెట్టి పాళయంలో మళ్లీ గెలిచి మంత్రి అయ్యారు.
వెంకటరమణన్(ఆహారం, ఫౌరసరఫరాల శాఖ): మైలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వెంకటరమణన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ , న్యాయవాది. విజయ్‌కు సుదీర్ఘకాలంగా అత్యంత సన్నిహిత మిత్రుడు. ప్రస్తుతం టీవీకే పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు మంత్రివర్గంలో చాలా కాలం తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చోటు దక్కడం గమనార్హం.
రాజ్ మోహన్ – పాఠశాల విద్యాశాఖ: చెన్నై విరుగంబాక్కంకు చెందిన రాజ్ మోహన్ (39) జర్నలిజం గ్రాడ్యుయేట్. విజయ్ టీవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ద్వారా సామాజిక అంశాలపై మాట్లాడుతూ పాపులర్ అయ్యారు. యాంకర్, నటుడు, వక్త అయిన ఈయన, 2023లో ’బాబా బ్లాక్ షీప్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. టీవీకేలో చేరిన ఈయనకు పాలసీ ప్రొపగండా సెక్రటరీ పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో ఎగ్మూర్ నియోజకవర్గం నుంచి గెలిచి పాఠశాల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
డాక్టర్ అరుణ్‌రాజ్ ( ఆరోగ్య శాఖమంత్రి) : నామక్కల్ కుమారమంగళానికి చెందిన 46 ఏళ్ల అరుణ్‌రాజ్ మాజీ ఐఆర్‌ఎస్ అధికారి, వెద్యుడు. 2002లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈయన, సివిల్ సరీ్వసెస్ పాసైన తర్వాత కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో (ఐఆర్‌ఎస్) పనిచేశారు. 2025లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీలో పాలసీ ప్రొపగండా జనరల్ సెక్రటరీగా ఉంటూ, విజయ్‌కు పరిపాలనా పరమైన కీలక సలహాలు అందిస్తున్నారు.
సి.టి.ఆర్. నిర్మల్ కుమార్(విద్యుత్, న్యాయ మంత్రి) ఉసిలంపట్టికి చెందిన నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అలాగే క్రిమినాలజీ పోలీస్ అడ్మిని్రస్టేషన్‌లో పీజీ చేశారు. తొలుత ఆర్‌ఎస్‌ఎస్, ఆ తర్వాత బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అన్నామలైతో విభేదాలతో 2023లో అన్నాడీఎంకేలో చేరి ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత 2025లో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉంటూ, మీడియాలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తూ మంత్రి అయ్యారు.
కీర్తన – పరిశ్రమల శాఖ: కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కీర్తన ఎమ్మెస్సీ గ్రాడ్యుయేట్. గతంలో ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ’ఐప్యాక్’ సంస్థలో పనిచేస్తూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత డీఎంకేకు చెందిన ’పెన్’ సంస్థలోనూ పనిచేశారు. 2025లో అక్కడి నుండి తప్పుకుని, స్వతంత్రంగా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న తరుణంలో..ఈ ఏడాది మార్చి 28న టీవీకేలో చేరారు. చేరిన మరుసటి రోజే ఆమెకు టికెట్ దక్కడం, విజయం సాధించి ఇప్పుడు ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొత్త తరం వారికి అవకాశం కల్పించినట్టుగా తమకుకూడా మంత్రి ఛాన్స్ వస్తుదన్న ఆశతో అనేక మంది పట్టభద్రులైన సామాన్య ఎమ్మెల్యేలు ఎదురు చూస్తుండటం విశేషం.
టి.కె. ప్రభు(ఖనిజ వనరులు): సాంప్రదాయ కాంగ్రెస్ కుటుంబానికి చెందిన టి.కె. ప్రభు వృత్తిరీత్యా వైద్యుడు. గతంలో తమిళనాడు కాంగ్రెస్ ఐటీ వింగ్‌లో కీలక నేతగా ఉండేవారు. ఇన్‌స్ట్రాగామ్ రీల్స్ ద్వారా మంచి ప్రజాదరణ పొందిన ప్రభు, టీవీకే స్థాపించిన తర్వాత అందులో చేరారు. ఈ ఎన్నికల్లో కారైకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్‌ను ఓడించి సంచలన విజయం నమోదు చేశారు.


