కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ

Kartarpur Sahib Corridor: DSGMC Urges Central Government To Reopen Kartarpur Sahib Corridor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వైరస్‌ రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనెజ్‌మెంట్‌ కమిటీ(డీఎస్‌జీఎంసీ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది మార్చి నెలలో కోవిడ్‌ నియంత్రణలో భాగంగా ఈ కారిడార్‌ను మూసివేశారు.  అయితే తాజాగా దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తున్న సమయంలో మళ్లీ తిరిగి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ను ప్రారంభించాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు డీఎస్‌జీఎంసీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు.

ఇక ఈ కారిడార్‌ను నవంబర్‌, 2019న గురునానాక్‌ దేవ్‌ 550 జయంతి సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహామ్మరి కారణంగా గత ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ఈ కారిడార్‌ పార్రంభానికి ముందు భారత్‌లోని సిక్కు భక్తులు  పంజాబ్‌లోని డేరాబాబా నానక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురుద్వారా కార్తాపూర్‌ సాహిబ్‌ను బైనాక్యులర్ల ద్వారా దర్శించుకునేవారు. అయితే ప్రస్తుతం బైనాక్యులర్లు సదుపాయం కూడా లేదని మంజింద్‌ సింగ్‌ తెలిపారు. సిక్కు మత వ్యవస్థాకులు గురు నానక్ దేవ్ ఆయన జీవితంలో చివరి18 ఏళ్లు పాకిస్తాన్‌ నారోవల్ జిల్లాలోని గురుద్వారాలో గడిపారు. ఈ కారిడార్‌ ద్వారా సిక్కు మత భక్తులు వీసా లేకుండానే పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top