నేడే నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1

ISRO set to make history with its first small satellite launch - Sakshi

షార్‌ నుంచి ఉదయం 9.18కి ప్రయోగం

కక్ష్యలోకి మైక్రోశాట్‌–2ఏ, ఆజాదీశాట్‌

సూళ్లూరుపేట(తిరుపతి):  చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. రాకెట్‌ ప్రయోగంపై శనివారం ‘షార్‌’లో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పర్యవేక్షణలో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ పద్మకుమార్‌ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి.. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. షార్‌ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది కావడం గమనార్హం. అంటే ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ), జియోసింక్రనస్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎల్‌వీ వంతు వచ్చింది.  

7 గంటల కౌంట్‌డౌన్‌  
34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు.

నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్‌–2ఏ(ఈఓఎస్‌శాట్‌)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. తర్వాత విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్‌ చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్‌డౌన్‌ను 7 గంటలుగా నిర్ణయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top