అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే

Indian Railways completes arch of world highest rail bridge - Sakshi

కశ్మీర్‌ లోయలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆర్చ్‌ నిర్మాణం పూర్తి

కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌కి సంబంధించిన ఆర్చ్‌ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్‌ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్‌ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్‌ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్‌ గంగల్‌ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్‌ ఒక ఇంజనీరింగ్‌ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్‌తో స్ఫూర్తి పొందిన రైల్వేస్‌ తాజా నిర్మాణంతో భారత్‌ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు.  

వంతెన ప్రత్యేకతలు
► పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా ఈ బ్రిడ్జ్‌ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్‌ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది.  
► 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి.
► 2017 నుంచి వంతెనపై ఆర్చ్‌ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్‌ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్‌ టన్నులు.  
► 28660 మెట్రిక్‌ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వాడారు.  
► 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్‌ చేశారు.  
► నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్‌ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్‌ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top