
వెన్ను తట్టి అభినందించిన మోదీ
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రధాని మోదీ దేశ గగన్‌యాన్ కలలను సాకారంచేసే భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను కలిసిన వేళ ఆనందంలో మునిగిపోయారు. రష్యా, అమెరికా మొదలు ఇస్రో, నాసా దాకా అన్ని రకాల వ్యోమగామి శిక్షణా వ్యయాలను భరించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని మోదీని కలిసిన వేళ శుభాంశు శుక్లా సైతం ఒకింత ఉది్వగ్నానికి లోనయ్యారు. అంతరిక్షకేంద్రంలో తాను అనుభవించి, గడించిన అది్వతీయ అనుభూతిని, అనుభవాన్ని చిన్న పిల్లాడిలా ఎంతో ఉత్సాహంతో ప్రధాని మోదీకి పూసగుచ్చినట్లు వివరించారు.
ఈ అపురూప ఘట్టానికి ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసం వేదికైంది. జూన్ 25 నుంచి జూలై 15వ తేదీదాకా యాగ్జియం–4 మిషన్ తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో గడిపిన భారత మొట్టమొదటి వ్యోమగామిగా చరిత్ర లిఖించాక తొలిసారిగా శుభాంశు శుక్లా ప్రధాని మోదీని సోమవారం కలిసి తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘వ్యోమగామిగా మాత్రమే కాదు అవనికి ఆవల సైతం భారతీయులు తమ కలలను నెరవేర్చుకోగలరని నువ్వు నిరూపించావు. వాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు’’అని శుక్లాను మోదీ పొగిడారు.
శుక్లా చెప్పిన ప్రతి విషయాన్ని మోదీ ఎంతో శ్రద్ధగా ఆలకించారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఐఎస్‌ఎస్‌లో రెపరెపలాడించినందుకు శుభాంశును మోదీ మనసారా అభినందించారు. వ్యోమగామి ప్రత్యేక జాకెట్ ధరించి వచ్చిన శుభాంశు కలవగానే కరచాలనం చేసి మోదీ ఆయనను ఆతీ్మయంగా హత్తుకున్నారు. శెభాష్ అంటూ భుజం తట్టారు. కొద్దిసేపు హాల్‌లో నడుస్తూ మాట్లాడారు. తర్వాత కూర్చుని శుక్లా సవివరంగా తన అంతరిక్ష యాత్ర వివరాలను మోదీకి తెలియజేశారు. ట్యాబ్‌లో పలు అంశాలను సోదాహరణంగా వివరించారు.
ఆ తర్వాత మోదీకి రెండు బహుమతులను బహూకరించారు. ఐఎస్‌ఎస్‌కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకెళ్లి తిరుగుపయనం వేళ మళ్లీ వెంట తీసుకొచ్చిన త్రివర్ణ పతాకాన్ని మోదీకి శుభాంశు బహూకరించారు. తర్వాత శుక్లాతో భేటీ వివరాలను ప్రధాని తన సామాజికమాధ్యమం ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘శుభాంశు శుక్లాతో భేటీ అద్భుతంగా సాగింది. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయోగాలు మొదలు అక్కడి సహచరుల తోడ్పాటు, అక్కడి ప్రయోగాల సత్ఫలితాలు, శాస్త్ర, సాంకేతికతల పురోభివృద్ధి, భారత ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్ట్ వివరాలపై ఎన్నో విషయాలు నాతో పంచుకున్నారు.
ఐఎస్‌ఎస్‌లో గడిపి, ఆయన చేసిన ప్రయోగాలతో శుక్లాను చూసి భారత్ గర్వపడుతోంది’’అని మోదీ వ్యాఖ్యానించారు. శుక్లా ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు జూన్ 29వ తేదీన మోదీతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుంచు కో. అక్కడి వాతావరణం, ప్రయోగశాల స్థితిగతులు, ప్రయోగాలు చేసే విధానం.. ఇలా ప్రతీది తర్వాత దేశీయంగా భారత్ చేపట్టే సొంత అంతరిక్ష ప్రయోగాలకు అక్కరకొస్తుంది’’అని శుక్లాకు మోదీ సూచించడం తెల్సిందే. ఇదే విషయా న్ని శుక్లా రెండు వారాల క్రితం గుర్తుచేసుకున్నారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో ఉన్నప్పుడు మోదీ నాకు ఇచ్చిన హోమ్‌వర్క్ నాకు బాగా గుర్తుంది. ఆ హోమ్‌వర్క్‌ను చాలా బాగా పూర్తిచేశా. ఐఎస్‌ఎస్‌లో నేను చేసిందంతా మళ్లీ ప్రధానికి చెప్పేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఐఎస్‌ఎస్‌లో నేను గడించిన అనుభవం మన గగన్‌యాన్ మిషన్‌కు ఎంత కీలకమో నాకు బాగా తెలుసు’’అని శుక్లా గతంలో చెప్పారు.