
న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ హిందీ ఉండాలి
హోం శాఖ మంత్రి అమిత్‌షా అభిలాష
గాంధీనగర్: మాట్లాడే భాషగా మాత్రమేకాదు శాస్త్ర, సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ హిందీ అంతర్లీనంగా కలిసిపోవాలిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభిలషించారు. ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఐదవ అఖిల భారతీయ రాజభాష సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమిత్‌షా పాల్గొని ప్రసంగించారు.
‘‘ హిందీకి ఇతర భారతీయభాషలకు మధ్య ఎలాంటి ఘర్షణ లేనేలేదు. దయానంద సరస్వతి, మహాత్మాగాంధీ, కేఎం మున్షీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి ఎందరో మహానుభావులు హిందీని ఆమోదించారు. హిందీ బాషను దేశవ్యాప్తంగా ప్రోత్సహించారు. గుజరాత్‌లో హిందీ, గుజరాతీ రెండూ తమ స్పష్టమైన ఉనికిను చాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఒకే రాష్ట్రంలో రెండు భాషలు ఉన్నాసరే రెండూ అభివృద్ధి చెందగలవని గుజరాత్ నిరూపించింది’’ అని అన్నారు.
హిందీ కేవలం భాష కాదు
‘‘హిందీ కేవలం మాట్లాడే భాష కాదు. పరిపాలనా భాష కూడా. శాస్త్ర సాంకేతిక రంగాలు, న్యాయ, పోలీస్ విభాగాల్లోనూ పరిపాలనలో హిందీని ఉపయోగిస్తే బాగుంటుంది. ఇలా అన్ని భాషలను కీలక రంగాల్లో పరిపాలన సౌలభ్యం కోసం వినియోగిస్తే పౌరులు సైతం ఈ భాషలను విరివిగా ఉపయోగిస్తారు. సంస్కృత భాష అనేది మనకు జ్ఞానగంగను ప్రసాదించింది. ఆ జ్ఞానాన్ని ఇంటింటికీ హిందీ మోసుకొచ్చింది. స్థానిక భాషల ద్వారా ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికీ చేరువైంది. మాతృభాషలోకాకుండా ఇతర భాషలో చిన్నారులకు కొత్త విషయాన్ని చెబితే మళ్లీ మాతృభాషలోనే దానిని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఇందుకోసం మెదడు సామర్థ్యంలో 25 నుంచి 30 శాతం ఖర్చవుతుంది. సామర్థ్యం వృథాను తగ్గించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ మాతృభాషలోనే మాట్లాడాలి. లేదంటే పిల్లలకు కొత్త అంశాలను తెల్సుకోవడం కష్టమవుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది’’ అని అన్నారు. ‘‘గుజరాతీ ఉన్నప్పటికీ గుజరాత్‌లో విద్యాంశాలు హిందీలోనే కొనసాగుతున్నాయి. ఇది మహాత్మాగాంధీ, దయానంద్ సరస్వతి వల్లే సాధ్యమైంది. అలాగే ప్రతి రాష్ట్రంలో ప్రజలు హిందీలోనూ సంప్రతింపులు కొనసాగించాలి’’ అని షా కోరారు. ‘హిందీ శబ్ద సింధూ అనేది 51,000 పదాలతో మొదలైంది. ఇప్పుడు 7,00,000 పదాలతో అలరారుతోంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని భాషల్లో అత్యధిక పదాల నిఘంటువుగా చరిత్రకెక్కుతుంది’’ అని ఆయన అన్నారు.
మోదీ శుభాకాంక్షలు
‘‘హిందీ కేవలం భాష, సమాచారమార్పిడి అనుసంధానం కాదు.. మన భారతీయ సంస్కృతి, ఉనికికి సజీవ వారసత్వ సంపదగా హిందీ భాసిల్లుతోంది. హిందీ దివస్ రోజు మీకందరికీ అంతులేని శుభాకాంక్షలు. హిందీ దివస్ సందర్భంగా భారతీయ భాషలన్నీ పరిఢవిల్లాలని ప్రతిజ్ఞచేద్దాం’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఆదివారం పోస్ట్ చేశారు.