
అసభ్యకర ఆరోపణలపై సుప్రీంకోర్టు సీరియస్
న్యాయమూర్తిపై ఆరోపణలు చేసిన కక్షిదారు, లాయర్లు క్షమాపణ చెప్పాలి
రేవంత్‌రెడ్డిపై దాఖలైన అట్రాసిటీ కేసు విచారణలో సీజేఐ ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే తక్కువకాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులపై నిరాధారంగా, అసభ్యకరంగా ఆరోపణలు చేసే ధోరణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ మౌషుమి భట్టాచార్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కక్షిదారు పెద్దిరాజు, ఆయన తరఫు న్యాయవాదులు బేషరతు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.
ఒక వారంలోపు క్షమాపణ పిటిషన్ సమర్పించాలని, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తి ఆ క్షమాపణను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. సోమవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘ఇటీవలి కాలంలో కారణం లేకుండా హైకోర్టు, ట్రయల్ కోర్టు జడ్జీలను విమర్శించే అలవాటు పెరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు జడ్జీలతో సమాన రక్షణ పొందుతారు.
రాష్ట్రంలో రాజకీయ నాయకుడిపై కేసు ఉంటే ఆ రాష్ట్రంలో న్యాయం దొరకదని భావించి పిటిషనర్ ఆ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరే సంస్కృతి పెరిగింది’అని ధర్మాసనం పేర్కొంది. కాగా సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పులను మార్చగలిగినా, హైకోర్టు న్యాయమూర్తులపై పరిపాలనా నియంత్రణ లేదని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలు అవమానకరంగా ఉన్నాయని, వీటిని సహించలేమని హెచ్చరించింది. ‘లాయర్లను శిక్షించడం కోర్టులకు ఆనందం కాదు. కానీ కోర్టుల వ్యవహారంలో జోక్యం చేసుకునేలా వ్యవహరిస్తే ఏమాత్రం సహించం’అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
కేసును మళ్లీ తెరవండి
ప్రస్తుత కేసు సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేయడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై పక్షపాతం, తప్పుడు ప్రవర్తన ఆరోపణలు చేస్తూ ఎన్.పెద్దిరాజు సుప్రీంకోర్టులో ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జూలై 29న సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే న్యాయమూర్తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు పిటిషనర్, ఆయన తరఫు న్యాయవాదులకు కంటెప్ట్ నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు 1954లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం ప్రస్తావించింది.
ఇలాంటి అవమానకర, అసభ్యకర ఆరోపణలకు పిటిషనర్ మాత్రమే కాకుండా, పిటిషన్‌పై సంతకం చేసిన న్యాయవాదులు కూడా సమాన బాధ్యత వహించాలన్నది ఆ తీర్పు సారాంశమని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పడం సరైనదని భావిస్తూ, కేసు మళ్లీ తెరిచి న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజి్రస్టార్ జనరల్‌ను ఆదేశించింది. ఒక వారం లోపు క్షమాపణ సమర్పించాలని, ఆ తర్వాత మరో వారం లోపు న్యాయమూర్తి ఆ క్షమాపణపై నిర్ణయం తీసుకోవాలని సీజేఐ చెప్పారు. కాగా పిటిషనర్ పెద్దిరాజు తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే బేషరతు క్షమాపణ పిటిషన్ సమర్పించారు.