‘అల్లనేరేడు’ తింటే ఆరోగ్యానికి ఎంత మేలో..

Health Benefits Of Allaneredu Friut Eating - Sakshi

జియ్యమ్మవలస: గిరిజనులకు అల్లనేరేడు తోటలు ఆసరాగా నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్షి్మపురం, కొమరాడ మండలాల్లో నేరేడు తోటలు ఎక్కువగా పెంచుతున్నారు. జియ్యమ్మవలస మండలంలో టికేజమ్ము, పిటిమండ, కొండచిలకాం, నడిమిసిరిపి, పల్లపుసిరిపి, చాపరాయిగూడ, బల్లేరు తదితర గ్రామాలలో విపరీతంగా నేరేడు చెట్లున్నాయి. గిరిజన గ్రామాలలోనే కాకుండా గిరిజనేతర గ్రామాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. సాధారణంగా అల్లనేరేడు చెట్టును నాటినప్పటి నుంచి సుమారు నాలుగేళ్లలోపు పంటకు వస్తుంది.

ఒక్కో చెట్టు సుమారు 100 కిలోల వరకు చెట్టు పెరుగుదలను బట్టి దిగుబడి వస్తుందని గిరిజనులు అంటున్నారు. గిరిజన గ్రామాలకు వ్యాపారులు వచ్చి బేరాలు కుదుర్చుకుంటారు. కేజీ నేరేడు పండ్లు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. వాటిని పట్టణాలకు తీసుకుపోయి కిలోను రూ.160కు విక్రయిస్తుంటారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పౌరాణికంగాను, ఔషధపరంగా కూడా జంబూ వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిదని, మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

నేరేడుకు పట్టణాల్లో డిమాండ్‌  
అల్లనేరేడు పండుకు గిరిజన ప్రాంతాలలో అంతగా ధర లేదు. పట్టణాల్లో ఎక్కువ ధర ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుండడంతో ఇక్కడ ఎవరూ కొనరు. దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటాం. 
- మండంగి అప్పారావు, బల్లేరుగూడ

షుగర్‌కు దివ్య ఔషధం
షుగర్‌ వ్యాధిగ్రస్తులు అల్లనేరేడు పండును తింటే దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ గింజలను పొడిరూపంలో చేసుకుని తింటే ఫలితం ఉంటుంది. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పండే ఈ పండుకు ఆదరణ ఉంది.
- డాక్టర్‌ శ్రావణ్‌కుమార్, వైద్యాధికారి, పీహెచ్‌సీ, ఆర్‌ఆర్‌బీపురం

చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top