ఐపీఎస్‌ కొలువుకు రాజీనామా.. శ్రీకృష్ణుడి సేవకు అంకితం

Haryana IPS Officer Seeks Voluntary Retirement Wants to Devote Herself to Service of Sri Krishna - Sakshi

సంచలన నిర్ణయం తీసుకున్న హరియాణా మహిళా ఐపీఎస్‌ అధికారి

చండీగఢ్‌: పోలీసు ఉద్యోగానికి ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఐపీఎస్‌ కొలువు అంటే మాటలు కాదు. ఇక ఐపీఎస్‌ ఉద్యోగం సాధించడం కూడా అంత సులువు కాదు. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌ సాధించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ మంది ఏళ్ల తరబడి అహోరాత్రాలు శ్రమించి.. కష్టపడి చదువుతారు. అయినా కొందరికి ఉద్యోగం రాదు. అంతలా కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని మధ్యలోనే వదులుకుంటారా.. అది కూడా దేవుని సేవ కోసం. చాలా కష్టం కదా. కానీ హరియాణాకు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. మిగతా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె నిర్ణయం విన్నవారంతా షాకవుతున్నారు. ఆ వివరాలు..

ప్రస్తుతం హరియాణా అంబాలా రేంజ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భారతి అరోరా. ఈ క్రమంలో ఆమె తాను స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు భాతరి అరోరా రాష్ట్ర ప్రధాన సలహాదారుకు లేఖ రాశారు. దానిలో "50 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, ఆల్ ఇండియా సర్వీసెస్ (డీసీఆర్‌బీ) నిబంధనలు, 1958 లోని రూల్ 16 (2) ప్రకారం, ఆగస్టు 1, 2021 నుంచి సర్వీసు నుంచి పదవీ విరమణ కోరుతూ.. నేను ఈ దరఖాస్తును స్వచ్ఛందంగా సమర్పించాను" అని తెలిపారు. 

“ఇప్పుడు నేను జీవితం అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు  నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు.  

ఐపీఎస్‌ అధికారిగా పని చేసిన భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్‌గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలనలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్‌కు బదిలీ చేశారు. భారతి తన లేఖలో “నా సేవ పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. నాకు సేవ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎదగడానికి అవకాశం కల్పించినందుకు ఈ సేవకు నేను చాలా కృతజ్ఞతలు. నాకు సరైన మార్గాన్ని చూపించినందుకు హరియాణా రాష్ట్రానికి నా కృతజ్ఞతలు. నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 1 నుంచి స్వచ్ఛందంగా సేవ నుంచి విరమించుకునేందుకు నన్ను అనుమతించమని నేను కోరుతున్నాను” అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top