Delhi Lieutenant Governor: ఢిల్లీకి ఎల్‌జీనే బాస్‌!

Government in Delhi means Lieutenant Governor - Sakshi

నూతన చట్టాన్ని నోటిఫై చేసిన కేంద్రం

ఆప్‌ ప్రభుత్వ అధికారాలు ఇకపై అంతంతమాత్రం

న్యూఢిల్లీ: దేశ రాజధానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఇన్‌చార్జ్‌గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్రం బుధవారం నోటిఫై చేసింది. దీంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంశంపై ఎల్‌జీ అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. జీఎన్‌సీటీడీ– 2021గా పిలిచే నూతన చట్టాన్ని ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో ఆప్‌ సహా పలు ప్రతిపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగవిరుద్ధమని విమర్శించాయి. తాజా నోటిఫికేషన్‌తో చట్టంలోని నిబంధనలు ఈనెల 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లయిందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్‌ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఎల్‌జీని కేంద్రం నియమిస్తునందున, ఇకపై  దాదాపుగా అన్ని అంశాలపై కేంద్రం పెత్తనం కొనసాగనుంది. ఇకపై ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే అని నూతన చట్టం వివరిస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో అటు కేంద్రం, ఇటు కేజ్రీవాల్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిన వేళ తాజా ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా విజృంభణపై మంగళవారం ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  

అరవింద్‌ ప్రభుత్వం నామమాత్రమే..
జీఎన్‌సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం నామమాత్రంగా మిగలనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తాజా ఆదేశాలతో ఇకపై ఎల్‌జీ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం నిలిపివేయగల అధికారాలు పొందారు.

ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలైన విద్య, అవినీతి నిరోధం, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, టూరిజం, ఎక్సైజ్, రవాణా లాంటి అంశాలతో పాటు అధికారుల బదిలీలతో సహా అన్ని విషయాల్లో అరవింద్‌ ప్రభుత్వం ఎల్‌జీ అనుమతితోనే అడుగులు వేయాల్సిఉంటుంది. కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎల్‌జీ రాష్ట్ర అధికారులకు నేరుగా ఆదేశాలివ్వవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్లతో పోలిస్తే ఢిల్లీ ఎల్‌జీ అధికారాలు భిన్నమైనవని అధికారులు వివరించారు. ఇప్పటివరకు అధికార పరిధిపై ఎల్‌జీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న సందిగ్ధాలను తాజా చట్టం నివారిస్తుందని చెప్పారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top