
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నేడు ఎంతో కీలకం కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల తొలగింపునకు సంబంధించిన బిల్లు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు.
తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయిన ప్రజాప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా మార్గం చూపే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులకు సైతం వర్తిస్తుంది. ఐదేళ్లు, అంతకు మించినకాలం జైలు శిక్ష విధించదగిన నేరానికి సంబంధించి సిట్టింగ్ మంత్రి, ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిని వరుసగా 30 రోజులు అరెస్టు అయినా లేదా కస్టడీలో ఉన్నా ఒక నెలలోపు వారు తమ పదవిని కోల్పోవలసి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. అంటే వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్నత పదవుల్లోని వారు ఉంటే వారు 31వ రోజు రాజీనామా చేయాలి లేదా వారు ఆటోమేటిక్‌గా తొలగించబడతారని బిల్లు తెలిపింది.
ఈ బిల్లులో ఏ రకమైన క్రిమినల్ అభియోగాలు ఉన్నాయో ఇంకా వివరించనప్పటికీ, వారిపై ఆరోపించిన నేరానికి కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించి ఉండాలి. ఇది హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలను కూడా వర్తిస్తుంది. ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు ఇంకా స్పందించలేదు. ఈ బిల్లు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లో కొత్త 5(A) నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది.
దాని ప్రకారం ఎవరైనా మంత్రిపై ఐదేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన నేరం చేశాడనే ఆరోపణ మేరకు అరెస్టు అయితే, లేదా కస్టడీలో ఉంటే, ప్రధానమంత్రి సలహా మేరకు ముప్పై ఒకటో రోజు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగిస్తారు. ముప్పై ఒకటో రోజులోపు రాష్ట్రపతి ప్రకటించకపోయినా, ఆ తర్వాత వచ్చే రోజు నుండి ఆటోమేటిక్‌గా వారు తొలగింపబడతారని బిల్లులో ఉంది. కాగా లోక్‌సభలో కేంద్రం రాజ్యాంగం (130వ సవరణ) బిల్లు, జమ్మూ అండ్ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది.