Singer Bhupinder Singh: దిగ్గజ గాయకుడు భూపీందర్‌ కన్నుమూత.. గాత్రంతోనే కాదు గిటార్‌తోనూ మ్యాజిక్‌

Ghazal Singer Bhupinder Singh Passed Away - Sakshi

ముంబై: ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించిన గజల్‌ గాయకుడు భూపీందర్‌ సింగ్‌(82) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కోలన్‌ కేన్సర్‌, కోవిడ్‌ అనంతర సమస్యలతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 

మోహమ్మద్‌ రఫీ, ఆర్డీ బర్మాన్‌, మదన్‌ మోహన్‌, లతా మంగేష్కర్‌, గుల్జర్‌లకు సమకాలీకుడు ఈయన. ఆయన భార్య ప్రముఖ గాయకురాలు మిథాలీ సింగ్‌. ధరమ్‌కాంటా చిత్రంలోని ధునియా ఛూటే.. యార్‌ నా ఛూటే, సితారా చిత్రంలో ‘థోడీ సీ జమీన్‌ థోడా ఆస్మాన్‌’ పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నామ్‌ గుమ్‌ జాయేగా, దిల్‌ థూండ్తా హై.. మరిచిపోలేని క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. 

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన భూపీందర్‌కు.. ఆ తర్వాత కొవిడ్‌ 19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే కోలన్‌ క్యాన్సర్‌, కొవిడ్‌ ఎఫెక్ట్‌తో ఆయన సోమవారం రాత్రి 8గం. ప్రాంతంలో మరణించారని వైద్యులు తెలిపారు. 

భూపీందర్‌సింగ్‌ ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోలో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్ మోహన్‌ దృష్టిలో పడి సినిమా అవకాశాలు అందుకున్నారు. 1964లో చేతన్‌ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన హఖీఖాత్‌ ఆయన తొలి చిత్రం. అయితే ఆయన సోలో ట్రాక్‌ మాత్రం రెండేళ్ల తర్వాత ఆఖ్రీ ఖాట్‌ చిత్రంలోనే(రుత్‌ జవాన్‌ జవాన్‌ రాత్‌ మెహర్‌బాన్‌...) పాడారు. 1980లో సినిమాలకు మెల్లిగా దూరం అవుతూ వచ్చిన ఆయన.. భార్య మిథాలీతో కలిసి ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేస్తూ వచ్చారు. 

కేవలం సింగర్‌గానే కాకుండా.. గిటారిస్ట్‌గా హరే రామా హరే కృష్ణ చిత్రంలో ‘దమ్‌ మారో దమ్‌’, యాదోన్‌ కీ బారాత్‌ చిత్రంలో ‘చురా లియా హై’, ‘చింగారి కోయ్‌ భడ్కే’, షోలే చిత్రంలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ లాంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు పని చేశారు. ఈ పాటల్లో గిటార్‌ మ్యూజిక్‌లు ఎంత ఫేమస్‌ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

భూపీందర్‌ సింగ్‌ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఈ మేరకు ఓ సంతాప ప్రకటన విడుదల చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top