సాక్షి,బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం బెంగళూరు శివార్లలో జరగనున్న బీజేపీ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు మోదీ కాన్వాయ్ వచ్చే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమవ్వడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని జెలటిన్ స్టిక్‌ను నిర్వీర్యం చేసింది.
ఈ ఘటనతో సభ ప్రాంగణం చుట్టూ భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు పోలీసులు. అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనం, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని నేపథ్యంతో పాటు ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. అధికారులు ఈ ఘటనను భద్రతా లోపంగా కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో గుర్తించిన ప్రయత్నంగా పేర్కొన్నారు.
ప్రధాని సభకు భారీ జనసందోహం హాజరయ్యే అవకాశం ఉండటంతో, పోలీసులు, ఇంటెలిజెన్స్ సంస్థలు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. భద్రతా సంస్థలు ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాయి. ఈ ఘటన కుట్రలో భాగమా లేదా స్థానిక స్థాయిలో జరిగినదా అన్నది తెలుసుకోవడానికి అధికారులు పరిశీలిస్తున్నారు.


