
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆయనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా ఈ కేసులో పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబధించి పలు వివరాలు కోరింది. వీటిల్లో ఆయన కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు వంటివి ఉన్నాయి.
మొత్తం 12-13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో వీటిల్లో పబ్లిక్ సెక్టార్‌తోపాటు ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు భారీగా అప్పులు ఇచ్చాయి. తాజాగా ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింద్ బ్యాంక్ ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
అనిల్ అంబానీ కంపెనీలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు బ్యాంక్ అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. వీరిని లోన్ క్లియరెన్స్‌లకు సంబంధించి అనుసరించిన ప్రాసెస్, రికవరీ చర్యలను అడగనున్నట్లు తెలుస్తోంది.
కాగా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇటీవల అనిల్ అంబానీుకి నోటీసులు ఇవ్వగా తాజాగా మరో ఆరుగురికి కూడా నోటీసులు కూడా ఇచ్చింది. గత వారం రూ.3,000 కోట్ల మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.