వారిని గుర్తించి, ఓటు తొలగించి, స్వదేశాలకు పంపిస్తాం
రాహుల్ గాంధీ ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
బిహార్‌లో అభివృద్ధి కావాలంటే ఎన్డీఏను ఆదరించాలని పిలుపు
నలంద: బిహార్‌లో జంగిల్‌రాజ్ మళ్లీ రావాలా? లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణం కొనసాగించాలా? అనేది ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి, వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు.
చొరబాటుదారులను బిహార్‌లో ఉండిపోనివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆక్షేపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు ఆయన ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను బయటకు వెళ్లగొట్టక తప్పదని పునరుద్ఘాటించారు. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట చొరబాటుదారులను కాపాడే యాత్ర నిర్వహించారని ధ్వజమెత్తారు. అమిత్ షా శనివారం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఒకవేళ లాలూ–రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్‌రాజ్ తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో బిహార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
అందుకోసమే లాలూ, సోనియా ఆరాటం
బిహార్‌లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్టించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు వంద మంది భక్తియార్ ఖిల్జీలు వచి్చనా ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయలేరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేస్తే వచ్చేసారి ఎన్నికలు ఒకదశలోనే జరుగుతాయని తేలి్చచెప్పారు. విపక్ష మహాగఠ్‌బంధన్ అవినీతి, ఆశ్రితపక్షపాతానికి మారుపేరు అని దుయ్యబట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత కుటుంబం తప్ప ప్రజల బాగు పట్టదన్నారు. బిహార్‌ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకలి్పంచారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు.
కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడిని ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. బిహార్ ప్రజల సంక్షేమం గురించి నిజాయితీగా కృషి చేస్తున్న నాయకులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ మాత్రమేనని స్పష్టంచేశారు. మోదీ, నితీశ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఆయన పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్‌రాజ్‌తో జనం కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ రాకతో జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి లభించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ అహరి్నశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి అడ్డాలోకి వెళ్లి మరీ ఖతం చేశామని అమిత్ షా వ్యాఖ్యానించారు.


