కోవిడ్‌పై ఈసీ సమీక్ష

ECI meets AIIMS chief, ICMR DG to review COVID-19 situation - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సమీక్ష నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్‌ స్థితిగతులను ఈసీకి కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్‌ టీకాకు అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాల్సి ఉందని వారు ఈసీకి తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవలతో ఈసీ చర్చలు జరిపింది.

దేశంలో ప్రస్తుతమున్న కోవిడ్‌ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలు ఆమోదయోగ్యం కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వీకే పాల్‌ ఈసీకి వివరించారు. ఇలాంటి ఎన్నికల కార్యక్రమాలకు అనుమతిని ఇవ్వకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూళ్లను ఈసీ త్వరలో ప్రకటించనుంది. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో యూపీలో పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేస్తున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది. డిజిటల్‌ వేదికగా వర్చువల్‌ ర్యాలీలు మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top