‘ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు’.. బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు!

Dont Mislead Public On Allopathy Delhi HC Slams Baba Ramdev - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు మొట్టికాయలు వేసింది ఢిల్లీ హైకోర్టు. అల్లోపతి ఔషధాలు, చికిత్సలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని స్పష్టం చేసింది. కోవిడ్‌-19 బూస్టర్‌ డోస్‌ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టీకా తీసుకున్నా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది.

బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, కరోనిల్‌ కోవిడ్‌పై పని చేయదంటూ పలు వైద్యుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రామ్‌దేవ్‌ బాబాకు చురకలు అంటించింది ధర్మాసనం. ‘ఇక్కడ వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. బాబా రామ్‌దేవ్‌ చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే ‍అనుచరులను కలిగి ఉండటాన్ని స్వాగతిస్తున్నాం. కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.’ అని పేర్కొన్నారు జస్టిస్‌ అనుప్‌ జైరాం భంభాని. 

మరోవైపు.. పతాంజలి కరోనిల్‌ను సవాల్‌ చేశారు డాక్టర్స్‌ అసోసియేషన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అఖిల్‌ సిబాల్‌. ఎలాంటి ట్రయల్స్‌, సరైన ధ్రువీకరణ లేకుండానే కరోనిల్‌ కోవిడ్‌-19ను నయం చేస్తుందని పతాంజలి చెబుతోందని కోర్టుకు తెలిపారు. గతంలోనే బాబా రామ్‌దేవ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) ఫిర్యాదు చేసింది. కరోనా ఉగ్రరూపం దాల్చిన క్రమంలో కరోనిల్‌పై ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించింది.

ఇదీ చదవండి: బాబా రామ్‌దేవ్‌ కీలక నిర్ణయం..పేరు మార్చేందుకు సిద్ధం..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top