
పట్నా: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థలకే తలనొప్పిగా మారింది. రెవెన్యూ వ్యవస్థలో లోపాలను తనిఖీ చేయాలనుకున్నారో ఏమో తెలియదు! ఓ వ్యక్తి మరో శునకానికి నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. ఇటీవలే ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి రెసిడెన్స్ సర్టీఫికెట్ జారీచేయడం, దీంతో సంబంధిత విభాగంపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. అయితే తాజాగా అదే బిహార్‌లోని నవాడా జిల్లాలో ఉన్న సిర్దాల బ్లాక్‌లో ‘డాగేశ్ బాబు’పేరుతో మరో దరఖాస్తు ఆర్టీపీఎస్ కార్యాలయానికి చేరింది. అందులో దరఖాస్తుదారు కాలమ్‌లో కుక్క ఫొటోను చూసి అధికారులు అవాక్కయ్యారు.
ఈ విషయం ఏకంగా నవాడా జిల్లా కలెక్టర్ రవి ప్రకాశ్ దృష్టికి వెళ్లింది. రాష్ట్రంలో మరో కుక్కకు స్థానిక నివాస దృవీకరణ పత్రం కావాలని అభ్యర్థన రావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఈ దరఖాస్తు చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సరదాగా చేసే ఇలాంటి పనుల వల్ల ప్రభుత్వ వ్యవస్థ సమయం వృథా అవ్వడరమే కాదు, అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు.
ప్రభుత్వ సేవల దురి్వనియోగాన్ని సహించబోమన్న కలెక్టర్.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీన మసౌరీ రెవెన్యూ అధికారులు ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి నివాస పత్రాన్ని జారీ చేశారు. అందులో ‘డాగ్ బాబు’తండ్రిపేరు కుత్తా బాబు, తల్లి పేరును కుతియాదేవిగా పేర్కొన్నారు. ఈ సర్టీఫికెట్ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు.. విషయం తమ దృష్టికి రాగానే సర్టీఫికెట్ రద్దు చేశామని తెలిపారు. ఈ దరఖాస్తు చేసిన వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్‌పైనా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.