ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు! | Dharamsthal case Geo tagging of Burial and Cremation sites | Sakshi
Sakshi News home page

ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!

Jul 29 2025 12:50 PM | Updated on Jul 29 2025 4:01 PM

Dharamsthal case Geo tagging of Burial and Cremation sites

ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో  ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్‌ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. 

ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్‌ అధికారులు వాటికి జియో ట్యాగింగ్‌ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 

1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్‌ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్‌ మహంతి నేతృత్వంలో ఒక ఎస్‌ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్‌సైట్‌ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!

మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్‌ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్‌ సాయం తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement